శ్రమజీవి ప్రసంగము
1 పేతురు 4:12; యాకోబు 1:12; ఆది.కాం. 6:5; 1కొరింధీ 10:13; మలాకీ 3:10; 11 కొరింథీ 12:7.
యెరూషలేము మందిరముయొక్క వెలుపల యేసు ప్రభువు సిలువ నెత్తుకొని యున్నారు. తనప్రజల మీద కూడ వారు (యూదులు) సిలువ నెత్తి యున్నారు. ఆలాగే ఆయన కాడికూడ ఎత్తుకున్నారు. ప్రజలమీద కూడ దానిని ఎత్తియున్నారు. ఆయన సిలువధారియై యున్నారు. ఆయనను వెంబడించువారును సిలువధారులై యున్నారు. నా కాడి సుళువు, నా భారము తేలికగా యున్నది అని ఆయన చెప్పినారు. అది సుళువు కాదు గాని ప్రభువు చెప్పినారు గనుక సుళువు. అది భారమే గాని ప్రభువు చెప్పినారు గనుక భారము లేదు. ప్రతి మనిషి మీద ఒక కాడి యున్నది. ఎడ్లకు కూడ కాడి యుండును. ఆ కాడి 2 భాగములు. ఒక ప్రక్క ఒక కర్ర, రెండవ ప్రక్కరెండవ కర్ర. రెండును కలిపి లాగితే సుళువు. ఈ శ్రమ, కష్టము, ఒంటరిగా సహింపవలెనంటే సహింపలేము గాని మనతోపాటు ఆయనకూడ మన కష్టములను సహిస్తున్నాడు, మరియు మనమిద్ధరము కలిసి సహిస్తున్నాము గనుక ఆ కాడి భారము కాదు. మనతోపాటు ప్రభువు కూడ సహిస్తున్నారు, సహాయము చేస్తున్నారు గనుక దీనిని సుళువుగానే గ్రహింపవచ్చును. ఇది మహా ముఖ్యమైన బోధ. కనుక ఇది కేవలము నేర్చుకొనుటకు కాదు గాని నేర్చుకొని అవలంభించుట కొరకే. అనగా అభ్యాసములో చూపించవలెను. అప్పుడుగాని ఆయన నేర్పిన విద్యకు, పడిన ప్రయాసకు ఫలితం దొరకదు ట్రైనింగ్ ఇచ్చి అక్కడే ఉంచరు గాని అనేక స్థలములకు పంపుదురు, నేర్చుకున్నది అవలంభించవలెనని చెప్పుదురు.
- కాడి: ప్రభువు మోపిన కాడి
- సిలువ: కష్టాలన్నీ కలిపి ఒక సిలువ అయినది.
- ముల్లు: పౌలు ప్రార్థించితే తీసివేస్తానని ప్రభువు చెప్పలేదు గాని నా కృప యుంచినాను, అది నీకు సరిపోయినది. "సహించేశక్తి నీకను గ్రహించినానని" చెప్పిరి. కష్టములను, సహించేశక్తిని కూడ ఆయనే ఇచ్చును.
- శోధన:- మీకు శోధనలు కలుగునుగాని సహించలేనంత శోధన రానియ్యను. శోధనలు, కష్టములు సహించుకునే సాధనములుకూడ ఏర్పరతును అని ప్రభువు చెప్పెను.
- శ్రమ:- అగ్నివంటి శ్రమ అని పేతురు పత్రికలో ఉన్నది. అందుకు ఆశ్చర్యపడకుడి. అగ్నివంటి శ్రమల వలననైనను మీకు బాధ కలుగదు. అది మీకు సహనము నేర్పించుట కొరకే.
ఉదా: గ్రామములోని పంతులుగారు కుర్రవానిని 4 దెబ్బలు కొడితే ఎదిరించును. అప్పుడు మరిన్ని దెబ్బలుకొట్టి, గోడకుర్చి వేయించి, బెంచిమీద, వరండామీద నిలువబెట్టును. ఎదిరించినాడు గనుక మరింత శిక్షించి, సహించేటందుకు నేర్పించినాడు.
ప్రధమ ఉపాధ్యాయుడు మాదిరి పాఠము చూపించినాడు. ప్రభువును అలాగే చూపించినారు. సిలువనెత్తి కొన్నారు, అంటగొట్టబడినారు, సిలువలో హతమై పోయినారు, భూస్థాపనైనారు గనుక "మీరుకూడా ఈలాగు మారండి" అని మీదిరి పాఠము చూపించినారు. ఆయన సిలువ మీద నున్నప్పుడును, బల్లెముతో పొడిచినపుడును, చంపినపుడును విసుగుకొనలేదు. ఆయన సహించిన దానికంటె ఎక్కువైన శ్రమ మనకు వచ్చునా? రాదు. స్వల్పమైన శ్రమ, ఇసుక రేణువంత శ్రమే మనకు ఉన్నది. అదే మనము సహించలేము.
ఉదా: ఎదిరించేవారిని చూచి, ఇన్ స్పెక్టర్ గారు సస్పెండ్ చేసి పంపినారు. అప్పుడాయన వారిని చూచి "మీరు పనిచేయలేరు, పోయి మొదటి తరగతిలో నేర్చుకోండి" అనును. ఆలాగే ప్రభువుకూడ సహించలేని వారిని ఎక్కడో ఒక చోట కూర్చుండబెట్టును.
- 1. ప్రభువు సహనమును గూర్చి చెప్పినారు,
- 2. ప్రభువు విసుగుకొనలేదు
- 3. ఆయన నిన్ను, నన్ను పిలిచేటప్పుడును, రక్షించేటప్పుడును ఎన్ని పర్యాయములు ఆయనమీద విసుగుకున్నామో.
మూలపాఠము:- మనము వినుగుకొనేటప్పుదు, ఆయన విసుగు కొనలేదు గనుక మనమును విసుగుకొనకూడదు అని జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. - 4. మనము సహించ గలిగేటంత గొప్ప శ్రమే మనకు వస్తుందిగాని దానిని మించి రాదు. దేనిని చూచికూడ అనగా సిలువ, కాడి, ముల్లు శోధన, శ్రమలను చూసి విసుగు కొనకూడదు.
- 5. శ్రమకాడి మనమీద, అనగా మన భుజములమీద ఉండి మోస్తున్నపుడు, ప్రభువు మనతోకూడ ఉండి మోస్తున్నారు గనుక విసుగు పడకూడదు.
- 6. మనము సిలువ మోసినందుకుగాను, ఆయన భూలోకములోనే ఒక గొప్ప బహుమానము అనుగ్రహించనై యున్నారు.
ఉదా: రైతు చెప్పిన పని కూలీ చేసినాడు. ఆలాగు చెప్పినట్లు చేస్తే బహుమానము ఇచ్చును. ఆలాగే ప్రభువు భూలోకములోనే మనకు బహుమానము ఇవ్వదలంచినారు గనుక ఆ బహుమానమును చూచి మనము ఆనందించవలెను. అపుడు శ్రమ, శ్రమగా ఉండదు. ఆనందము వలన ఆ శ్రమను బట్టి కలుగు బహుమానములు అధికమగును. ఎన్ని? ఒకటికాదు, రెండు కాదు. మనము అనుభవించే శ్రమలెన్నో మనము పొందే బహుమానములు అన్నే. ఎన్ని రోజులు కష్టపడితే అన్ని రోజులు కూలి వచ్చును గదా! కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు బుసబుస మంటున్నవారలారా! రుసరుసమంటున్న వారలారా! ఆలాగనకండి (ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పినట్టు? 6 మాటలు). - 7. ఎవరైతే శోధన సహించగలరో వారికి జీవ కిరీటము, అనగా పరలోకపు బహుమానము దొరుకును. వారు పరలోకములో రాజులై యుంటారు. సింహాసనముల మీద ఉంటారు.
- 1) శ్రమ మాకక్కర లేదంటే, మోక్షము మాకు అక్కరలేదన్న మాటే.
- 2) శ్రమ మాకక్కరలేదని ఎవరంటారో, వారికి మహిమ సింహాసనము అక్కరలేదు.
- 3) శ్రమలు అక్కరలేదంటే, వారికి కిరీటము అక్కర లేదన్నమాట.
- 4) దేవునియొక్క అనంత సహవాస భాగ్యము అక్కర లేదన్నమాట. దేవదూతలు దేవుని పరలోకము మధ్య ఉన్నట్లు, మనము శ్రమల మధ్య ఉండవలెను.
- (1) భూలోక బహుమానములు ఏవి? శ్రమ సమయములో ఒక బహుమానము కావలెను. అదేదనగా సహింపు. అప్పుడు శ్రమచూచి హడలిపోయినాము గదా? అయితే ఆయన శక్తి అనుగ్రహించినారు గనుక ఇప్పుడు శ్రమ అంటే లెక్కలేదు. శ్రమకాలమందు అరటి పంద్డు, టెంకాయలు అవసరమా? శ్రమ అనుభవించే స్థితి అవనరము.
- (2) బహుమానము:- శ్రమపడే సమయమందు దేవుని వలన శక్తి పొందుచున్నాము. “సహోదరులు శత్రువుల మధ్య ఉన్నారు, వారు ఒంటరిగానే ఉన్నారు. గాని దేవుడు మాకు సహాయకారిగా ఉన్నాడని వారి నిమిత్తమును ప్రార్ధించవలెను. ఏమని? ప్రభువా! మాకు శక్తి ఇస్తున్నమాట సత్యమే. మా సహోదరులు, శత్రువుల చేతిలో శ్రమపడుచున్నారు. గనుక వారికికూడా శక్తి దయచేయుము. మన శ్రమలలో మనకు ప్రభువే మీదిరి. సిలువలో ఆయన చుట్టు రెండు గుంపులవారున్నారు. స్నేహితులు, శత్రువులున్నారు. ఆయన వారి నిమిత్తమై ప్రార్థించినారు. శ్రమ వచ్చినపుడు, కండ్లు పైకెత్తి దూరమున ఉన్న వారి నిమిత్తమై ప్రార్థించవలెను.
- (3) యోబు నేర్పిన మాట:- ఎన్ని శ్రమలో అన్ని దానములు. శ్రమలమధ్య యోబు చదివిన పద్యము “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనెను, ఆయనకే స్తుతికలుగును గాక!” ఈలాగు యోబువలె మనమును స్తుతి చేయవలెను. సమర్పణ చేయవలెను.
- 1) సహింపు
- 2) ప్రార్థన
- 3) స్తుతి
} బహుమానము
శ్రమలు ఈ ప్రపంచములో మాత్రముండును. అయితే వాటికి గొప్ప బహుమాన ముండును, సహాయముకూడ దొరుకును.
- 1) శ్రమలు వచ్చినప్పుడు ప్రభువు తీసివేయగలరు.
- 2) శ్రమలు వచ్చినప్పుడు ఒక్కోసారి ప్రభువు తీసివేయరు గాని శక్తి అనుగ్రహిస్తారు.
బబులోనులో నెబుకద్నెజరు కథ: షద్రకు, మేషాకు, అబెద్నెగో అను వారికి ఆయన శ్రమ తీసివేయలేదు. పడ్డవారెందరు? ముగ్గురు. కనబడ్డవారు ఎందరు? నలుగురు. అనగా ఒక్కరు ఎక్స్ ట్రాగా (అదనముగా) కనబడ్డారు.
"అగ్నిని కలుగజేసిన సృష్టికర్తే, అగ్నిని సృష్టించిన సృష్టికర్తే దగ్గర ఉంటే అగ్ని ఏమియు చేయలేదు". అగ్నివంటి శ్రమలో గొప్ప కాపుదల ఉన్నది. మా దేవుడు తప్పించ గలవాడు. అయితే, ఒకవేళ ఆయన తప్పించడా! "అదీ మా భాగ్యమే" అని వారు చెప్పిరి. అధికమైన శ్రమలు వస్తే అదికూడ ఆయన తప్పించగలరు.
సహించే దానికంటే ఎక్కువ శ్రమ రానివ్వడు. ఒకవేళ నహించలేని శ్రమ రానిస్తే దానికి మించిన గొప్ప ఉపకారము కూడ రానివ్వగలడు.
పౌలుకు శరీరంలో ఉన్న ముల్లు, సాతాను దూత. ప్రభువు - "నేను తీసివేయను. నీ దగ్గర కృప ఉన్నది" అన్నారు. గనుక మన శ్రమలో ఆయన ఈ రెండు విధముల వర్తించుచున్నారు.
- 1) శ్రమలో సహింపు దయచేయుట,
- 2) శ్రమ తీసివేయకుండుట, కృప అనుగ్రహించుట.
ఉదా: ఆరుగురు పిల్లలు ఆడుకొనుచున్నారనుకొనండి. వారి ఎదురుగా తిండి పెట్టితే, నోరూరి చప్పరించుట జరుగును. వారి నోట ఊట వచ్చును. ఆలాగే మీరు శ్రమ అనుభ విస్తునప్పుడు, శ్రమవైపు చూచి మురుస్తూ ఉంటారా! లేక అరుస్తారా? క్రొత్త శ్రమవస్తే క్రొత్త బహుమానము వచ్చును. గనుక శ్రమవైవు చూడక దాని వెంబడి ఉండే బహుమానమును చూచి ఆనందించవలెను. కీడు చాటున ప్రభువు పెట్టిన మేలేమిటో, అని ఆనందించవలెను. "కీడు కేవలముగ కీడంచు భావించి ఖిన్న్నుడనైపోదునా?... క్రీస్తు దాచిన మేలు చూడకుండగ నుందునా?".
శ్రమలు అనుభవించండి. దానికి ఆయన అనేక బహుమానములిస్తారు. శ్రమ అనుభవించేవారు ఇది గ్రహించవలెను. వారికి అనేక బహుమానములున్నవి. ప్రభువు నేర్పరి, తీర్పరి. పిల్లవాడు చింతగింజలు మింగివేసినాడు. ఒక లెంపకాయ, రెండు లెంపకాయలు తల్లి కొట్టినది. ఎందుకు? కక్కివేయుటకు. ఆలాగే పాపం కక్కివేయకపోతే మీరు ప్రభువునకు దక్కరు, చిక్కరు, పరలోకమునకెక్కరు. దేవుడు ఎప్పుడూ ఎవరిమీదికి శ్రమ పంపరు. అవి మన పాపమువల్ల, అజాగ్రత్తవల్ల వచ్చును. ఎవరికిని ఏవిధమైన శ్రమను రానివ్వరు. ముగ్గురు మనుష్యులను పడవేసినపుడు దేవుడు తప్పించినారా? లేదా! ఆలాగే మన శ్రమలనుండి కూడ మనలను తప్పించి, రక్షించి, కాపాడవలెనని ఆయన కోరుచున్నారు. అట్టి స్థితి ప్రభువు మీకు అందించును గాక. ఆమేన్.