ఆపదల నివృత్తి
యుద్ధములవలన గాని, బాంబుల వలనగాని, మరియే ఇతర భ్రమలవలనైనను శరీరమునకే హాని. అయితే పాపము వలన శరీరమునకును, ప్రాణమునకును, ఆత్మీయ జీవనమునకును హాని కలుగును. ఆపదల నివృత్తిని గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు, కొన్ని గుంపులను గూర్చి చెప్పవలసి యుండును.
- 1. మొదటి గుంపు విశ్వాసులు:
దానియేలు 3వ అధ్యాయము. షద్రకు, మేషాకు, అబెద్నెగో అను ముగ్గురు అగ్ని హోత్రము పాలగుటకు ఒప్పుకొన్నారు. వారు భయపడలేదు. "మా దేవుడు మమ్మును రక్షింపగలడు, ఒకవేళ రక్షింపక పోయినను పరవాలేదు" అని వారు చెప్పిరి. అగ్నిలో చనిపోవుటకును వారు సిద్ధముగా నున్నారు. అయితే దేవుడు వారిని రక్షించెను. ఆలాగే కొందరు విశ్వాసులు యుద్ధములకుగాని, బాంబులకుగాని, భయపడరు. దేవుని చిత్తమైన యెడల, బాంబులవల్ల చనిపోవుటకు కూడ సిద్ధముగా నున్నామని అందురు. మరియు శరీర మరణమునకు జడియరు. ప్రభువు - "శరీరమును చంపువారికి భయపడవద్దు, దేవునికి మాత్రమే భయపడవలెనని" చెప్పెను. విశ్వాసులు - యూదుల యౌవనుల వలె యుద్ధ సమయములలోను, బాంబులకును భయపడరు. తాము పాపము చేసిన యెడల, మోక్షము దొరుకదు అని పాపము చేయుటకు ఆ ముగ్గురు భయపడిరి. హెబ్రీ. 11:35లో కొందరు మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి యాతన పెట్టబడిరి అని గలదు. గనుక ఎట్టి శ్రమలకైనను విశ్వాసులు భయపడరు.
1942 సం॥ము మార్చి 13వ తేదీన బాంబుల సంగతి రాజమండ్రిలో వినబడి గొప్ప ఆందోళన కలిగెను. ఎందువలననగా, దేవునియందు విశ్వాసము లేకపోవుట వలన. విశ్వాసి అయితే "ప్రభువు చిత్తము, తప్పింపక పోయినను సరే" అని భయపడకుండును. కొందరు ఎన్ని కష్టములు వచ్చినను, "అన్నియు మేలు కొరకే" అని పలుకుదురు. విశ్వాసులకు కీడు అనేది లేదు. "బ్రతికినచో ప్రభువు సేవచేయుదును. చనిపోయినచో, మహా గొప్ప మహిమతో దేవదూతలు చేయు సేవ చేయుదును" అనునది విశ్వాసుల వాక్యమై యున్నది. ఆత్మ, పాపము వలన ఈ జీవితములో దేవునికి దూరమైన యెడల అది గొప్ప హాని, అదే కీడు అని విశ్వాసి తలంచును. పాప, మరణముల వలన నిత్య నరకమునకు ఆత్మ పోవుట కీడు అని విశ్వాసికి తెలుసును గనుక పాపమునకు భయపడును. శరీరమునకు, ఆస్థికి, ఘనతకు కలుగు నష్టము దిద్దుబాటునకును, ఆత్మ జీవనాభివృద్ధికిని సహాయ పడునని విశ్వాసి యొక్త అనుభవమై యున్నది. ఏదైనను సరే, మరణమైన సరే, ప్రభువు రక్షించినను సరే, రక్షించకపోయినను సరే! అనువారు మొదటి గుంపు వారైయున్నారు. క్రీస్తు ప్రభువు యెదుటనుండి ఆ గిన్నె తొలగిన మనకు రక్షణలేదు. ఒకానొకప్పుడు విశ్వాసులకు శరీర హాని తప్పదు. ఆ సమయమందు వారు స్తుతి ఎక్కువ చేయుదురు. హత సాక్షులు చంపబడినంత మాత్రమున, అపజయము పొందినారని చెప్పకూడదు. లోకముయొక్క దృష్టిలో వారు అపజయము పొందినట్లు కనబడినను, దేవుని దృష్టిలో వారు జయమే పొందియున్నారు. అయితే నాశనము కోరుకొనువారిని కూడ దేవుడు ఒకప్పుడు తప్పించును. యోనా నీళ్ళలోపడి మునిగి, నశించుటకు కోరుకొనెను గాని నాశనమైనాడా? లేదు. ఆయన శరీర రీతిగా కూడ రక్షింపబడి, అనేక వేల మందిని రక్షించుటకు కారకుడాయెను. అందువలన దేవునికి మహిమ. బాంబులు పడి క్రైస్తవ విశ్వాసులు ఎందుకు నశించుచున్నారను ప్రశ్నకు ఈ వ్యాసము జవాబైయున్నది. క్రైస్తవులు ఎందుకు బాంబులవలన నశించినారను మరియొక ప్రశ్నకు జవాబు: వారిలో ఏదో ఒక లోపముండుట వలన.
- 2. రెండవ గుంపు విశ్వాసులు: వీరు అపాయము వచ్చినప్పుడు తప్పించుకొనుటకు ప్రయత్నము చేయుదురు. శత్రువులు తరిమినప్పుడు మరియొక గ్రామము వెళ్ళవచ్చునని ప్రభువు చెప్పిన మాటయును (మత్తయి 10:23), దేవదూతలు లోతును తప్పించిన చరిత్రయును వీరికి ఆధారము (ఆది. 19వ అధ్యా॥). తప్పించుకొన వచ్చునుగాని భయపడరాదను సిద్ధాంతము వీరిది. అపాయము నిమిత్తము ప్రార్ధనచేసి, తమ ప్రార్ధన దేవుడు నెరవేర్చునని నమ్ముదురు గాని ఆ ప్రార్ధనయొక్క నెరవేర్పు నిమిత్తము తాము కూడ ప్రయత్నము చేయుదురు. ఇది ఈ గుంపువారి లక్షణము. శిష్యులు గాలి తుఫానుకు భయపడిరి. గాని ప్రభువు భయపడెనా? ఆయన హాయిగానే, అపాయము లేనట్టే నిద్రించుచుండెను. ఇదే విశ్వాసి నేర్చుకొనవలసిన పాటము.
- 3. మూడవ గుంపు విశ్వాసులు: "అపాయము నీ యొద్దకు రాదు" (కీర్తన 91:7) వీరు ఈ వాగ్ధానము పట్టుకొందురు. అపాయము రాకుండ చేయుమని నేను ప్రార్థించినాను, 'హాని రానివ్వనని' దేవుడు వాక్యములో వ్రాయించినాడు. అది తప్పక నెరవేరునని ఈ గుంపువారు గట్టి పట్టు పట్టుదురు. వీరు ఆపద సమాపించుట చూచి, కూర్చుని బైబిలు విప్పి ప్రార్ధనచేసి, మార్కు 11:24తో ముగించి సంతోషముతో నుందురు. అందరికి ఆపదగాని నాకు మాత్రము ఆపద సంభవింపదు అని ప్రచారము చేతురు. ఈ గుంపులోని వారు వాగ్ధానములు పొందుదురు.
- 4. నాల్గవ గుంపు విశ్వాసులు: ఈ గుంపువారు దర్శన జీవితమును వాడుక చేయువారు. వీరు పైమూడు గుంపుల వారి విశ్వాస చరిత్ర మెచ్చుకొందురు. అయినను ప్రభువు దర్శనమందు చూపించునవి చూచుటకును, కనబడి చెప్పునవి వినుటకును కోరుకొందురు. దేవుని కృపవలన ఇట్టివారు మన బైబిలు మిషనులో కొద్దిగా నున్నారు. గనుక రాత్రి హాయిగా నిద్రించి, తెల్లవారు జామున 4 గం॥ల నుండి బళ్ళున తెల్లవారు వరకు మోకాళ్ళ మీద ఉండండి. అప్పుడు ప్రభువు కనబడి మాట్లాడును. ఈ ప్రకారము చేయకపోయిన దర్శనవరము పోవును.
- 5. ఐదవ గుంపు విశ్వాసులు: విశ్వాసులను ఆనుకొనే విశ్వాసులు వీరు. విశ్వాసులను ఆనుకొని యుండుట మాకు సంతోషము అని అందురు. మాకు దర్శనములు లేవు, ప్రభువు చూచాయగానైన కనబడుటలేదు. కొందరికి వ్రాత కనబడుతుందట, మాకు అది కూడ లేదు. మా కూటములలో దర్శనములున్న వారు గలరు. వారు ఏమి చెప్పుదురో అదే మేము విని, ఆ ప్రకారముగా యుందుము. బాంబులు పడునప్పుడు వారు ఇంటిలోనున్న యెడల మేమును ఉందుము. వారు పారిపోయిన యెడల మేమును పారిపోవుదుము. "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెను" (నిర్గమ. 14:14) అని దర్శన జీవనముగల మోషే చెప్పినమాట విని, ఇశ్రాయేలీయులు నమ్మి ఎర్ర సముద్రము అడ్దుబడినారు. అట్టివారే ఈ గుంపులోనివారు. గొప్ప గొప్ప విశ్వానులు కూడ ఈ గుంవులో నుందురు. ఆరు లక్షల మందిలో దర్శనవరము పొందినవారు ఇద్దరే గదా! మోషే అహరోనులు. మిగిలినవారు దర్శనవరము లేకపోయినంత మాత్రమున అవిశ్వాసులని చెప్పకూడదు. దర్శన వరము గలవారు కూడ సహజభీతి కలిగియుండవచ్చును. అది అవిశ్వాసముకాదు. దర్శనములో మహిమ సంగతులు, భయంకరమైన సంగతులు, అసహ్యమైన సంగతులు బయలుపడును. ప్రభువు వాటిని భయపడుటకు చూపించలేదు. అట్టివి కలవని చెప్పుటకు చూపించును. ధైర్యముగలవారు ఎట్టివాటినైనను చూచి తెలినికొందురు.
- 6. ఆరవ గుంపు విశ్వాసులు: వీరు "నడిపింపు" గుంపు విశ్వాసులు. అనగా ప్రభువు మమ్ములను ఏలాగు నడిపించిన ఆలాగు నడుస్తాము అని చెప్పే గుంపు. వీరికి దర్శనములు ఉండవు. గాని దేవుడు వారిని చక్కగా నడిపించును. ఎట్లనగా, రేపు బాంబులు పడుననగా ఈ దినము "పలానివారు జబ్బుగా నున్నారు, వెంటనే రమ్మని" ఉత్తరము వచ్చును. నీవు బయలుదేరి వెళ్ళుదువు. తర్వాత బాంబులు పడి అనేకులు నశింతురు. నీవు తప్పింపబడుదువు.