తిరస్కరణి విద్య అభ్యసించుటెట్లు



'తిరస్కరణి విద్య' కావలసినవారు శరీరముయొక్క పైభాగము శుద్ధి, అనుదిన స్నానము, అనుదిన వస్త్రశుద్ధి, ఉదర శుద్ధి ఆచరించి, అనుదినము ప్రార్ధన చేసినయెడల అట్టి విద్య క్రమముగా వచ్చును. బైబిలు మిషను వారికి ఇది త్వరగా వచ్చును. ఎందుచేతనంటే ప్రభువు బైబిలు మిషనును బైలుపర్చినాడు గనుక ఇదికూడా బైలుపర్చగలడు. పరలోకములోని భక్తులను తీసికొని వస్తున్నాడు గనుక ఇది కూడ బైలుపర్చగలడు. సృష్టియంతటిని సన్నిధి కూటమునకు తీసికొని వస్తున్నాడు గనుక ఇదికూడ అనుగ్రహించగలడు. యోహాను 14:14 (ఇట్టి సంగతులు అనగా గాలిలో ప్రయాణము చేయుట, వంటలేని ఆహార విషయములు మొదలైన సంగతులు, ఇట్లు అనేకములు బెంజిమన్ గారు, అయ్యగారు రాజమండ్రిలోని అయ్యగారి గదిలో మాట్లాడుకొని సంతోషించినారు). "ఇవన్నియు ఎవ్పట్టికైన జరుగకమానవు" అని నేను నిశ్చయము చెప్పినాను. ఆయన నమ్మినాడు. అప్పుడే ఇంకొకటి మాట్లాడుకొన్నాము. "అన్నియు జరుగుతాయి, ఇంకా ఎక్కువ జరుగుతాయి" గాని ప్రతి దానికి సొలొమోను చెప్పినట్లు సమయముంటుంది. ఇటువంటిది

  1. మీకు తెలియడానికి
  2. మీకు అభ్యానము చేయుటకు,
  3. అనుభవించుటకు,
  4. ప్రత్యక్షముగా చూచుటకు; అనగా ఈ నాలుగు నేర్పుటకే ఇట్టి మీటింగులు పెట్టుటకు కారణము.

బరంపురము సన్నిధి కూటస్తులకు ఇవన్నియు తెలుసును. ఆ మీటింగులలో ఉన్నపుడు, ప్రభువు వాటిని గూర్చిన సంగతులు చూచాయగా చెప్పినారు. అప్పుడు అయ్యగారు ఇవన్నియు నాకు ముందే తెలుసును అన్నారు. వారెంతో ఆశ్చర్యపడి ఎంతో సంతోషించిరి గాని అసూయపడలేదు. "మరెందుకు ఈ మహిమను దాచిపెట్టినారు" అని వారు కొద్దిగా స్నేహ భావముతో నిందించినారు. "ఎవరూ నమ్మరు, ఆక్షేపిస్తారు" అని అయ్యగారు వారికి జవాబు చెప్పిరి. బెంజిమన్ గారికిని అదే చెప్పినారు. అన్ని మన ద్వారా జరుగుతాయి గనుక ఒక్కటే జ్ఞాపకముంచుకొనండి. ఎన్ని అడ్డములు, కష్టాలు వచ్చినను, చింత అనేది లేకుండ చేసుకొనండి. చింత ఉన్నయెడల ఇపుడు మన తలమీద ఉన్న కిరీటము పరలోకము వెళ్ళిపోవును. మన విశ్వాసము వల్ల, మనకు తెలియకుండా, మన తలమీద కిరీటముండును. అది చింతవల్ల పరలోకము వెళ్లిపోవును. ఒక స్త్రీ ప్రభువుకు కిరీటము వేయవలెను. వెయ్యేండ్ల వరిపాలన ప్రారంభమందు, క్రీస్తునకు ఒక స్త్రీ కిరీటము వేయవలెను. హవ్వ అనే ఒక స్త్రీ వల్ల పాపము వచ్చినది. మరియ అనే ఒక స్త్రీ వల్ల రక్షకుడు వచ్చినాడు. మూడవ స్త్రీ వలన ప్రభువునకు కిరీటము రావలెను. పురుషులవల్ల కాదు. ఆ స్త్రీ ఎవరు? ఓ తండ్రీ! లోకములో నేటివరకు ఎన్ని యుద్ధములు జరిగినవో, ఆ అన్ని యుద్ధములకంటె ఎక్కువ కష్టమైన యుద్ధము మేము సైతానుతో చేయవలసియున్నది. పురుగునకు పురుగునకు, మృగమునకు మృగమునకు, పక్షికి పక్షికి, మనుష్యునకు మనుష్యునకు జరుగు యుద్ధము మేము ఎరుగుదుము. మరియు సైతానుకు దైవజనులకు జరిగే యుద్ధములుకూడ మేము ఎరుగుదుము. దురాత్మలకు, భక్తులకు జరిగే యుద్ధములు మేము ఎరుగుదుము. ప్రతిదినము ఉదయముననే మంచికిని, చెడుగునకు జరుగుచున్న పోరాటము ఎరుగుదుము. అజ్ఞానమునకును, జ్ఞానమునకును యుద్ధము జరుగుట మేము ఎరుగుదుము.


ఆలాగే దురాచారమునకును, సదాచారమునకును యుద్ధము జరుగుట మేమెరుగుదుము. అనాచారమునకును, ఆచారమునకును యుద్ధము జరుగుట మేమెరుగుదుము. హర్మెగెద్దోనులో జరుగనైయున్న ఘోర యుద్ధము గరించి ప్రకటన గ్రంథములో చదువుకొన్నాము. అలాగే గోగు, మాగోగు యుద్ధము జరుగునని ప్రకటనలోనే చదువుకొన్నాము. ఇవి గాక చిన్న చిన్న చిల్లరి యుద్ధములు ఎన్నిగలవో చెప్పలేము. అయితే ప్రభువా! చెడుగుతో యుద్ధము చేయుటకు నీవు క్రైస్తవ సంఘములకు నేర్పినావు. పెండ్లి కుమార్తె సంఘమునకును, చెడుగుతోయుద్ధము చేయ నేర్పినావు. మరియు బైబిలు మిషనుకు, తక్కిన మిషనులకు జరుగవలసిన యుద్ధముకూడ మాకు నేర్పుచున్నావు. గాని అది ఇంకా మాకు పూర్తిగా అబ్బలేదు గనుక నీ కటాక్షాత్మను మామీద కుమ్మరించుము. ఆమేన్.