ప్రభువు ప్రార్ధనయొక్క విభజన



పరలోకమందున్న మాతండ్రీ!

పరలోకమందున్న మా తండ్రీ! అనునది ప్రార్ధనంతటికి ప్రవేశ పంక్తియె యున్నది. మా తండ్రీ! అనునది పేరు కాదుగాని బంధుత్వ పదము. అప్పుడు మన దృష్టి మోక్షమువైపు ఉండును. తండ్రీ! అను మాటలో దేవుడు తన పేరు ఇంకా బైలుపరుపలేదు. నీ నామము అన్నప్పుడు, ఆయనకు ఒక పేరున్నట్లు తెలిసినది. ఆ పేరు, దేవుడు తుదకు లోకములో అవతరించిన "యేసుక్రీస్తు" అని తెలియుచున్నది. అప్పుఢు మనదృష్టి అంతా, ఆయన అవతార స్థానమైన భూమిమీద నున్నది. రాజ్యమన్నప్పుడు మన దృష్టి ప్రపంచ మందంతటను వ్యాపించియున్న క్రైస్తవ సంఘము తట్టు ఉన్నది. నీ చిత్తము అన్నప్పుడు మన దృష్టి పైకిని క్రిందికిని ఉన్నది. పైన దేవదూతలు ఆయన చిత్తమును నెరవేర్చుచున్నారు. భూమిమీద మనుష్యులు కూడ ఆయన చిత్తము నెరవేర్చవలెనని కోరుచున్నారు, అనగా భక్తిగా నడచుట. ఆయన చిత్తము భూమిమీద పూర్తిగా నెరవేరుట లేదుగాని, వెయ్యేండ్ల పరిపాలనలో పూర్తిగా నెరవేరును.


ఆహారమనగా శరీర జీవనమునకు కావలసినవన్నియు - ఇండ్లు, వాకిళ్ళు, ధనధాన్యములు, స్వజనులు, సంఘస్థులు, ప్రభుత్వములో అధికారులు, స్నేహితులు మొదలైన వారుకూడ శరీరాహారమునకు సంబంధించినవారే. కాని ఇందులో ఆత్మీయ ఆహార విషయము కూడ జ్ఞాపకము వచ్చును. ఎంత శరీర ఆహారమైనను, అందులో దేవుని దీవెన లేకపోతే మన జీవనమునకు సహాయకారిగా నుండనేరదు.


మమ్మును క్షమించుము అను మాటలో పాపపు టొప్పుదల యున్నది. ఇది ఆపదలో గల మనవి. ఎందుకనిన శత్రువులను మనము క్షమించలేక పోతున్నాము గనుకనే కొందరు ప్రభువు ప్రార్ధన చేయరు. "శోధన" అను మాటలో దేవా! క్షమించినావు గాని మరల పాపములో పడిపోకుండునట్లు ఈ మనవి చేయుచున్నానని అర్ధము. కీడు అను మాటలో లోకములోని పాపమంతయు జ్ఞాపకము వచ్చుచున్నది. గనుక దేవా! మమ్మును ఈ లోకమునుండి తప్పించి మోక్షమునకు చేర్చుకొనుము అని వేడుకొనుచున్నాము.