ఆదివార ప్రమేయము - 1
ఆదివార ఆచారము:
ఆదివారమున తండ్రియైన దేవుడు సృష్టి పని ఆరంభించెను. ఆదివారమున కుమారుడైన తండ్రి మరణమునుండి లేచెను. ఆదివారమున పునరుత్ధానము ప్రకటన ఆయెను. ఆదివారమున మొదటి క్రైస్తవ సంఘము మీద, మొదటిమారు పరిశుద్దాత్మ కుమ్మరింపబడెను. తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు మూడు గొప్ప విలువైన కార్యములు ఆదివారమున జరిగినందున, సంఘము ఈ దినమును మరువలేకున్నది. అందుచేతనే ఆదివారము ఆరాధన ఏర్పరచుకొన్నది. ప్రభువు ఆదివారమున లేవలేదని కొందరి అభిప్రాయము. అయితే ఆయన ఆదివారమున లేచుట అబద్ధముకాదు. ఎందుకనిన, "ఆదివారము సూర్యోదయమునకు ముందే ఆయన లేచెను" అని సువార్తలలో వ్రాయబడియున్నది. ఆ వార్తయే అందరికి ప్రకటింపబడెను. సంఘముయొక్క సంతోషములో ప్రభువుకూడ పాలివాడై యుండుటను బట్టియే, శిష్యులు ఆదివారము కూడుకొన్నప్పుడు ప్రభువు వారిమధ్య నిలువబడెను. ఆదివారము కూడు కొన్నప్పుడు చందా పోగుచేయవలెనని పౌలు వ్రాయుచుండెను. దానినిబట్టి చూడగా, ఆదికాల సంఘమునకు ఆరాధనదినము శనివారము కాదుగాని, ఆదివారమని కనబడుచున్నది.
- 1) ఆదివారమున ఉదయము లేవడముతోనే ప్రభువుయొద్దకు వునరుత్థానము తలంచుకొని విజయస్తుతి చేయవలెను.
- 2) సాధ్యమైనంత వరకు శరీర సంబంధమైన పనులుగాని, లోక సంబంధమైన పనులుగాని, ఆటపాటలు గాని లేకుండ నుండవలెను. అనగా బజారుకు వెళ్లుట, ఇళ్ళు వాకిండ్లు అలుకుట, ఊరు ప్రయాణము చేయుట, లోక సంబంధమైన పనిమీద ఒకరి ఇంటికి వెళ్ళుట, లోక సంబంధమైన మంచి మంచి పుస్తకములు చదువుట మొదలగునవన్నియు మానివేయవలెను. (వంట, స్నానము తప్పదుగదా!) క్రైస్తవ దేశములలో కొందరు వంట అంతకు ముందు దినమే తయారు చేసికొందురు, కొందరు అదికూడ తినరు, కొందరు చాలసేపు నిద్రపోరు.
- 3) కొందరు భైబిలు చదువుటలోను, కీర్తనలు పాడుకొనుటలోను, వ్యాఖ్యానములు చదువు కొనుటలోను, దినమంతయు గడిపివేయుదురు. ఇది మహా మంచివాడుక.
- 4) ఆదివారమునకు కావలసినవి అన్నియు శనివారమే సిద్ధపరచుకొనవలెను. అది మనకు సిద్ధపరచుకొనే రోజు.
- 5) ఆదివారమంతయు మహిమ సంగతులు, పరిశుద్ధ సంగతులు, దైవోపకార కార్యములు ఈ మొదలైనవే తలంపులోనికి, బలవంతముగానైనను రప్పించుకొనవలెను. ఇట్టివి పుస్తకములో వ్రాసికొని ధ్యానించుట మొదలుపెట్టిన యెడల, రాత్రివరకు అట్టి ధ్యానముండును. అంత పెద్దనోట్సు తయారుచేసికొనవలెను.
-
6) యెషయా 58:18,14లో ఉన్న సంగతులనుబట్టి విశ్రాంతి దినమును గౌరవపరచు వారు ఉన్నత స్థలమును ఆక్రమించుకొందురు. ఎవరు
- 1) దేవునిని,
- 2) ఆయన వాక్యమును,
- 3) ఆయన ఉపకారములను,
- 4) ఆయన సంఘమును,
- 5) ఆయన సంకల్పనను (ఏర్పాటును) గౌరవింతురో, వారిని ఆయన గౌరవించును.
- 6) ఎవరు ఆరాధన దినమును గౌరవింతురో, ఆయన వారిని గౌరవించును. ఎవరు ఆరాధన దినమును గౌరవింతురో, వారి దినములను దేవుడు గౌరవించి దీవించును.
-
7) ఆదివారము ఎట్లు గడుపవలెనో, ప్రకటన మొదటి అధ్యాయము వలన నేర్చుకొను చున్నాము.
- 1. యోహాను ఆదివారమున ఆత్మవశుడాయెను. (మనమును మోకాళ్ళ మీదనున్న యెడల, ఆత్మ మనలోనికి ప్రవేశించును).
- 2. యోహాను బూరవంటి స్వరము వినెను. (మనముకూడ ఆదివారమున స్వరము వినవలెను).
- 3) యోహాను విన్న సంగతులు వ్రాసెను. (మనముకూడ ఆవేళ విను వాక్యములు, ప్రత్యేకమైన పుస్తకములో వ్రాయవలెను).
- 4. యోహాను దేవునియొక్క మహిమ స్వరూపమును చూడగల్గెను, అనగా దర్శనము పొందెను. (మనము కూడ ఆవేళ మిక్కిలి స్పష్టముగా ప్రభువును చూడవలెను).
- 5) యోహాను అత్మవశమాయెను. చెవులతో వినెను, కంటితో చూచెను. ఆలాగు వినిన, చూచిన వాటిని వ్రాసెను. ఈ నాలుగుపనులు మనముకూడ చేయవలెను.
- 6) యోహాను, క్రీస్తు మహిమ ఎదుట శవమాయెను. అప్పుడు ప్రభువు - భయపడవద్దు, నేను సజీవుడను, పాతాళ లోకముయొక్క తాళపు చెవులు నా చేతిలో నున్నవి అని పలికిరి. (మనము అట్లుపడియుండే అవసరము లేదు) పెండ్లికుమార్తె శాఖవారు అట్లు పడరు, సంతోషముతో నుందురు. యోహానుకు అది క్రొత్త అనుభవము గనుక అట్లు జరిగెను.
అప్పటి యోహాను చరిత్ర ఏదనగా వృద్దుడు, ఖైది, తోటివారందరు చనిపోయిరి. సువార్త చేయవలెనన్న యెడల కట్టు(బంధకములు).
షరా: మహిమ యెదుట యోహాను శవమై యుండుట నిజమేగాని, శ్రమలయెదుటను శవమై యుండవలెను. వృద్ధుడు ఆయెననగా, త్వరలో మృతుడు కాబోవుచున్నాడు. "మృతుల లోకముయొక్క తాళపు చెవులు నా చేతిలోనున్నవని" ప్రభువు చెప్పెను. గనుక మృతుడైనను పరవాలేదు. "నిన్ను పాతిపెట్టుదురు, శవము పాతాళమునకు వెళ్ళును. అనగా భూస్థాపన చేయుదురు. అయినను పరవాలేదు, పాతాళలోకవు తాళపుచెవులు నా చేతిలో నున్నవి" అని ప్రభువు చెప్పెను.
ఈ కన్ను చూడని కథలు, ఆ కన్ను చూచినది. ఆ వుద్ధాప్య హస్తము వ్రకటన గ్రంథమంతయు వ్రాసెను. శరీరముయొక్క కృశింపుతోగాని, నేత్రములతోగాని, జ్ఞాపక శక్తితోగాని, హస్తములతోగాని ఏమియు పనిలేనట్లు, దేవుడు మరియొక ప్రత్యేక బలమిచ్చి, మహిమ చూపించి వ్రాయించెను. బంధకములని, చెర అని, ఖైది అని ఎన్ని ఆటంకములు ఉన్నను, ప్రభువు తన పని చేయించక మానడు. అవన్నియు ఆయనకు అడ్డు రావు.