నాయకులకు సలహా
- 1వ సలహా:- మనము క్రిస్మసురోజున క్రిస్మసు పాటలు పాడుదుము. జనవరి 1వ తారీఖున నూతన సం॥ము పాటలు పాడుదుము. భస్మబుధవారము నుండి ఆరంభమయ్యే శ్రమకాలములో శ్రమకాల పాటలు పాడుదుము, మంచి శుక్రవారము పాడవలసినవి పాడుదుము. పునరుత్థాన దినమున, ఆ రోజుకు సంబంధించిన పాటలు పాడుదురు. గనుక ఏ పండుగరోజున ఆ పాటలు పాడుట విడిచిపెట్టుట మంచిపద్ధతికాదు గాని అన్ని కీర్తనలు పాడు వాడుక అన్నిటిని మించిన పద్ధతియై ఉండును. అనగా ప్రతి మంచిశుక్రవారము రోజున క్రిస్మసుకీర్తన, పునరుత్తాన కీర్తనకూడ పాడాలి. ఆ రోజునే దైవభక్తి వృద్ధి కీర్తనకూడా పాడాలి. అలాగే అన్ని పండుగలలోను అన్ని పండుగలకు సంబంధించిన కీర్తనలు పాడాలి. ఎందుకంటే అన్ని ముఖ్యమే, మన జీవితవృద్ధికి అన్ని ముఖ్యమే. సలహా ఇచ్చాను గనుక పాడితే మంచిదే.
షరా:- అయ్యగారు ఒక పెండ్లికి అన్ని కీర్తనలు పాడించిరి. వారికి కోపము వచ్చినందున నేటివరకు గుడికి వచ్చుట మానివేసిరి. - 2వ సలహా:- "క్రొత్తవారు బైబిలు మిషను కూటములకు వచ్చినప్పుడు బైబిలు మిషనుకు సంబంధించిన కీర్తనలు పాడవలెను" ఎందుకనగా, మన కీర్తనలు వారు ఎప్పుడు నేర్చుకొందురు? ఇతర మిషను కీర్తనలుకూడ పాడితే తప్పులేదుకాని "క్రొత్తవారు నేర్చుకొనేటందుకు బైబిలు మిషను కీర్తనలు పాడవలెను" అనగా మనము వారి కీర్తనలు నేర్చుకొనుచున్నాముగానీ వారు మన కీర్తనలు నేర్చుకొనుట లేదుగదా! ఆలాగు వారును మన కీర్తనలు నేర్చుకొనవలెనంటే, మనము మన కీర్తనలనే తప్పక పాడవలెను, "వాడుక చేయవలెను".
- 3వ సలహా:- క్రైస్తవమతము అన్ని భాషలకు సంబంధించిన మతము గనుక అన్ని భాషలకు సంబంధించిన కీర్తనలు మనము పాడవలెను. ఈ వేళ ఇంగ్లీషు, రేపు అరవము, ఎల్లుండి కన్నడం, ఓడ్రం, బెంగాలి భాషలలో కీర్తనలు పాడవలెను. ఆ తర్వాత జర్మనీ భాషలోకూడ ఈ ప్రకారముగానే పాడవలెను. అమెరికాలో అన్ని భాషలు నేర్చుకున్నవారున్నారు. కాబట్టి మనము సమయమునుబట్టి అన్ని భాషలలో సంగతులు నేర్చుకొనుట మంచిది.
- 4వ సలహా:- స్వర్గీయ భాషలోని కీర్తనలు ప్రభువే ఇస్తారు. "యెహోవ నామొర లాలించెను" అను కీర్తన ఒకరు తెలుగులో పాడుచుంటే, మరొకరు అదే సంగతి స్వర్గీయ భాషలో పాడుదురు.
- 5వ సలహా:- ఇది చాల కష్టము. ఒకరు ఒక భాషలో ఒక కీర్తన పాడితే, మరియొకరు దాని అర్ధము మరియొక భాషలో పాడుదురు. ఈ అనుభవమును వాడుక చేయవలెను.
-
6వ సలహా:-
- 1) భక్తిగల బైబిలు పాఠములు చదువుట,
- 2) భక్తిగల ఆరాధనలు,
- 3) భక్తిగల కానుకలు,
- 4) భక్తిగల మీటింగులు చేయుట
దేవుడు మాట్లాడే దర్శనములున్నప్పటికిని ఒకరి ప్రవర్తనను గూర్చి అల్లరిచేయుట ఉన్నా, అన్నీ సున్న. "నేను నా పరిశుద్ధ రక్తముతో" శుద్ధిచేసి, రక్షించుటకై ఎన్నో పాట్లుపడుచుండగా, నీవు ఎందుకు చెడుగును ప్రకటన చేయుదువు? అది నాకెంతో దుఃఖము అని ప్రభువు చెప్పుచున్నారు. మత్తయి 25వ అధ్యాయములో ఎడమ ప్రక్కనున్నవారితో ప్రభువు చెప్పినది: "నేను నీయొద్దకు వస్తే నీవు నన్ను సత్కరింపలేదు" అన్నారు. నీవు ఎప్పుడు వచ్చినావు ప్రభువా? అని అంటే నా సహోదరులలో ఒక్కరిని సత్కరించనప్పుడు, నన్నును సత్కరించనట్టే అనెను.