దైవప్రార్ధన సలహా
సర్వమత సంఘ ప్రతినిధులగు ఆర్యులారా! సృష్టికర్త నామమున మీకు శుభములు కలుగునుగాక! ఈ సభలోనే ఈ దిగువనున్న ప్రార్ధనలు చేసి, దేవుడిచ్చు జవాబులు ప్రచురించండి.
- ప్రార్ధన:
- దేవా! సృష్టికర్తా! మా ప్రియజనకా! నీకనేక నమస్కారములు. లోకవాసులు నిత్యశాంతి కలుగుటకై, మేము ఏమేమి చేయవలెనో మాకు నేర్చుము.
- మాలో సహోదరభావము నిత్యము కలిగియుండుటకై మేము ఏమేమి చేయవలెనో మాకు నేర్పుము.
- "అహింస పరమ ధర్మమైయున్నది" అను వచనమును నెరవేర్చుటకై మేము ఏమేమి చేయవలెనో మాకు నేర్పుము. ఆమేన్.
సలహా: మన పాపస్థితిని ఒప్పుకొని, ఇకమీదట పాప విసర్దన చేయయత్నింతుమని ప్రమాణముచేసి, కాపుదల నిమిత్తమై మన సమస్తమును దేవునికి సమర్పించి, ఆయన చేసిన మేళ్ళు తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులాచరించి, ఓపికతో నిశ్శబ్ధముగా కొంతసేపు దైవధ్యాన స్థితిలో నున్నయెడల, ఆయన మనకు శరీర రూపముతో కనబడి, మన ప్రశ్నలకు స్వరముతోనైనను, గాలిలో వ్రాత మూలముగనైనను జవాబిచ్చును. మన అంశములను గురించి దీర్ఘాలోచన చేయుటయు, అందరి అభిప్రాయములు తెలిసి కొనుటయు, స్వానుభవములు చెప్పుకొనుటయు, సలహాలు ఇచ్చుటయు మంచిదే. కానీ, దేవుని అభిప్రాయమును గూడ తెలిసికొనుట, అంతకన్నా మంచిది.
అందరిని పిలిచి దేవుని పిలువని యెడల మన సభ కొరత గలదియగును. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి సర్వసత్కార్యములు చేయునపుడు, మన పరిమితి జ్ఞానమువలన కొన్ని లోపములు కలుగును. కనుక అపరిమిత జ్ఞానముగల దేవుని అడిగిన యెడల, మన లోపములను ఆయన దిద్దును. అప్పుడు బేధాభిప్రాయములుకూడ క్రమముగ అంతరించును. మన ప్రార్ధనాంశములన్నియు దేవునియెదుట చెప్పుకొని ప్రార్ధించుటకై, ఇట్టి మహాసభలు తరచుగా చేయశక్తి ననుగ్రహించుమని దేవుని ప్రార్థింపవలెను.
మనము ఏ ప్రార్ధన చేసినను అది దేవునికి కీర్తియు, మనకు మేలును కలిగించునదై యుండవలెను. ప్రార్ధన చేసిన పిమ్మట దైవచిత్తాను సారముగ మనము పనులు చక్కబెట్టుకొనుచుండగా, నెరవేర్పు త్వరగా కనబడనప్పుడు నిరాశపడక, అపనమ్మికకు చోటియ్యక, దేవుని చిత్తమునే మనస్సునందు గురిగా పెట్టుకొని ముందుకు సాగి వెళ్ళవలెను. అప్పుడు మన సమస్త కార్యములు సఫలమగును.