ఇంకొకమారే (ఆది 18:32)
అబ్రాహాము సొదొమ పట్టణము యొక్క నాశనమును గురించి విన్నప్పుడు దేవుని ప్రార్ధించెను. తన ప్రార్ధన, పదేపదే చేసిన విజ్ఞాపన ప్రార్ధనయై యున్నది. తన ప్రార్ధనాంశము ముగింపునకు వచ్చినప్పుడు అబ్రాహాము దేవునితో ఇట్లనెను. "ప్రభువు కోపపడని యెడల నేనింకొకమారే మాటలాడెదను." చూచితిరా! అబ్రాహాము ఈమాట ఎప్పుడుపలికినాడు? ప్రార్ధన ముగింపు సమయములో, అనగా ప్రార్థించుటకు ఇక సంగతిలేదు.
- మీరు మీ ప్రార్ధనాంశములన్నియు ముగించినారా? మిమ్మును గూర్చికాదు. ఇతరులను గురించి చేయవలసిన ప్రార్ధనలు అన్నియు ముగించినారా?
- మనము ప్రార్థింపవలసిన అవసరము గలవారు లోకములో అనేకులు గలరు. పాపులు, రోగులు, బీదలు, చిక్కులలో నున్నవారు, వీరందరికి మీ ప్రార్ధన అవసరము. వారు మిమ్మును అడిగినను, అడగకపోయినను ప్రార్ధింపవలెను.
- మన సహమానవుల నిమిత్తమైన ప్రార్ధన, మన విధియైయున్నది. వారిని గురించి ప్రార్థించినారా? ముగించినారా?
- ఇప్పుడు మనము ప్రార్థింపవలసిన అవసరముగల దేశములు అనేకములున్నవి. వాటిని గురించి ప్రార్ధించినారా? ముగించినారా?
- మనకు విశ్వాసుల ప్రార్ధనలు అవసరమైయున్నవి. అయినను ఇతరులను గురించియు, ఇతర దేశములను గురించియు ప్రార్ధించవలెను. అప్పుడు మనకుకూడ శ్రమ నివారణ కలుగును.
- మన ప్రార్ధన అవసరమైన సమస్యలన్నిటి గురించి ప్రార్ధించినారా?
- పంటలను గురించియు ప్రార్ధించినారా? నరులకు కలుగుచున్న నష్ట పరిహారముల నిమిత్తమై ప్రార్ధించినారా?
- వైద్యశాలలు, బైబిలు సొసైటీ, ట్రాక్టు సొసైటీ, ప్రభుత్వము మొదలైన వాటిని గురించి ప్రార్థించినారా?
- కలహములు, యుద్ధములు ఆపుచేయుమని ప్రార్థించినారా?
- మీకు తోచిన క్రొత్త అంశములను గురించి ప్రార్థించినారా? ముగించినారా?
మనలను గురించి ప్రార్ధించుట ఎంత అవసరమో, ఇతరులను గురించి ప్రార్థించుట కూడ అంతే అవసరము. వార్తా పత్రికలలో క్రొత్త సంగతులు తెలిసిన యెడల వాటన్నిటి గురించి ప్రార్ధింపవలెను. మన ప్రార్ధనలు నెరవేరినను నెరవేరకపోయినను, ప్రార్ధించుట మన విధి గనుక మన విధి నెరవేర్చుకొనవలెను. అబ్రాహాము ప్రార్ధన ప్రకారము సొదొమ పట్టణమును దేవుడు నాశనము చేయకుండ ఉండెనా? ఒక్క లోతును మాత్రమే దేవుడు రక్షించెను, అయితే సొదొమ పాప పరిహారము కాలేదు. అందుచేత నాశనము తప్పినదికాదు. హృదయములోని మార్పునుబట్టి కష్టనివారణ, మార్చు లేనియెడల నివారణ కలుగదు. గనుక ప్రజలయొక్క మారుమనస్సు గురించి ప్రార్ధించవలెను. 10 మంది మారుమనస్సు గలవారున్న యెడల, ఆ పట్టణము నాశనము కాకపోవునుగాని, ఆ 10మందికూడ అక్కడ లేరు. అందుచేత నాశనము. అబ్రాహాముయొక్క ప్రార్ధన బొత్తిగా నెరవేరలేదని మనము అనకూడదు. ఒక చిన్న ఊరికి నాశనము రాలేదు. ఆ ఊరిలో లోతు రక్షింపబడెను. ఈ రెండును ప్రార్ధనకు నెరవేర్పులు, జవాబులు.