ధ్యానపరుని వృద్ధి - 2



ప్రార్ధన : ఓ ప్రభువా! చెట్టు ఏ విధముగా సారము పీల్చుకొనునో, అట్లే మా ఆత్మీయ జీవనవృద్ధి కొరకు నీ వాక్యములోనుండి సారము తీసికొనగలుగు కృప అనుగ్రహించుము. వర్తమానమిచ్చినందుకు వందనములు. చెట్టు ఊటను ఏలాగు అందుకొనునో, అట్లే నీ వర్తమానమును మేము అందుకొనునట్లు చేయుము. వినువారు అందుకొనలేక పోయినను, నీవు వర్తమానము ఇస్తావు గనుక వందనములు. రాజకుమారుని పెండ్లి విందు అందరికిని; రాజబాటలో నున్నవారిని కూడ తోడుకొని రమ్మని చెప్పిన తర్వాత, చాలాస్థలము ఉండిపోయెను. గనుక ఒక్కొక్కరు అందుకొన వలసిన వర్తమానము అందుకొనే కృప దయచేయుము. ఆమేన్.


"అతడు నీటి కాలువల యోరను నాటబడినవాడై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును" కీర్తన 1:3. వృక్షమునకు వృద్ధిగలదు. ఆలాగే విశ్వాసికూడ వృద్ధి పొందవలెను. లోకములో అందరు వృద్ధి కోరుకొందురు.


వర్తమానము వినునప్పుడు

ఇవన్నియు మన వృద్ధికి ఆటంకము. మానవ జీవితములో; పుట్టినప్పుడు శిశుజీవితము, తరువాత బాల్య స్థితి, యౌవన స్థితి, కౌమార స్థితి, చివరగా వృద్ధాప్యము; ఈ రీతిగా వృద్ధిగలదు. ఈ వృద్ధి అవసరము లేదనేవారు లేరు. గాలివలన, నీటివలన, ఆహారము వలన వృద్ధి కలుగును. మరుగుజ్జు వాళ్లు పైవాటన్నిటిని తిందురుగాని ఎదుగరు. శరీర జీవితములో మరియొక వృద్ధి ఏదనగా, పెద్దవారైన తరువాత "సొమ్ము కావలెనని కోరుదురు". వర్తకుడు "పది రూపాయలు, మొదటగా, తర్వాత ఇరవై రూపాయలు..." ఈ రీతిగా వృద్ధి కావలెనని కోరును. ఏది కావలెనో దాని వృద్ధి కోరుదురు. ధనవృద్ధి అవసరము గాని ధనాపేక్ష తప్పు. మరియు విద్య అవసరమే, దానిలోని వృద్ధికూడ అవసరమే.


నీటికాలువ యోరను నాటబడిన చెట్టు - మానవ జీవితములోని వీటన్నిటియొక్క వృద్ధికి మాదిరిగా నున్నది. వృక్ష జీవితములో వృద్ధి కావలెను. శరీర జీవితములో వృద్ధి కావలెను. ఆలాగే ఆత్మీయ జీవితములో కూడ వృద్ధి కావలెను. విశ్వాసి ఎందులో వృద్ధి పొందవలెను? బైబిలు చదువుటలో వృద్ధి పొందవలెను. ఆది, నిర్గమ, లేవి మొదలైనవి చదివి, దినవృత్తాంత గ్రంథములలో పేర్లు ఉన్నవని మానివేసిన యెడల, అది వృద్ధి కాదు. బైబిలు క్రమముగా చదువుటలో వృద్ధిపొందవలెను. చదువుట వలన కధలలో వృద్ధి, గాని అందులోని ఊట లాగవలెను. ప్రతి కధకు బోధ ఉన్నది. ఆ బోధ గైకొనిన యెడల బైబిలుజ్ఞానములో వృద్ధి పొందుదుము. ఎవరు బైబిలు జ్ఞానములో వృద్ధి పొందరో, వారు ఆత్మీయ జీవితములో వృద్ధి పొందరు. బైబిలు చదువుట మాత్రమే కాదు. ఆ సారము తీసికొంటేనే వృద్ధి కలుగును. అందులోని సారమే బైబిలు అనుభవము. మరియు ప్రార్ధనలో వృద్ధి పొందవలెను.


ఎన్ని ప్రార్ధనలు చేసినను, నెరవేరనప్పుడు ఎట్లుండును? అప్పుడు నిరాశపడితే ప్రార్ధనలో వృద్ధి ఉందదు. వాక్యము చదువునప్పుడు, దానిలో నాకు ఏ సారములేదని విసుగుకొంటే వృద్ధిలేనట్లే. పార్ధనకు జవాబు రాకపోయినను సంతోషించవలెను. అప్పుడు ప్రార్ధనలో వృద్ధి కలుగును. మరియు ఆత్మీయ జీవనవృద్ధి కొరకు సేవచేయవలెను, ఇతరులకు సువార్త చెప్పవలెను. శరీర జీవితము, ఆత్మీయ జీవితము రెండును కలిసి మానవ జీవితమైనది. ఒకరు మంచి విద్యావంతుడైనంత మాత్రమున, అతడు శరీర జీవితము గలవాడుగాని ఆత్మీయ జీవితము గలవాడు కాదు. ఈ రెండు జీవితములు అనుభవించుటకు, దేవుడు మానవుని కలుగజేసెను. యేసుప్రభువు ఈ భూలోకమునకు వచ్చినప్పుడు చేసిన ఒక ముఖ్యమైన పని ఆత్మ రక్షణ. యేసు ప్రభువు రేపు మేఘముమీద వచ్చినప్పుడు చేయు ముఖ్యమైన పని, శరీర రక్షణ అనుగ్రహించుట. మొదటవచ్చి పాపములను పరిహారము చేసి, ఎట్లు రక్షించెనో, అట్లే రేపు శరీర రక్షణ కలుగచేయును. ఇక్కడ దేహమునకు జబ్బు రాకుండ చేయలేము గనుక ఆయన మన దేహ సంరక్షణ చేయుచున్నాడు గాని అప్పుడు రక్షణ కలుగజేయును. అప్పుడు మన దేహముతో అమెరికాకు వెళ్ళగలము, ఎక్కడికైనా వెళ్ళగలము. చీకటిగాని, మరేదియు అడ్డురాదు. ఇప్పుడు దేహమునకు ఆయనే అన్ని సదుపాయములు ఇచ్చుచున్నాడు. గాని పరిపూర్ణ రక్షణ రాలేదు (రోమా 8వఅధ్యా).


శరీర జీవనమునకు కావలసిన ప్రార్ధన: "మా దినాహారము నేడు మాకు దయచేయుము". ఆత్మీయ జీవనమునకు కావల్సిన ప్రార్ధన: "మా బుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా బుణములను క్షమించుము". రేపు ప్రభువు వచ్చిన తరువాత మన దేహమునకు ముండ్లు గాని, మరేమియు గాని అడ్డు రావు. ఇవి శరీర జీవితమునకు సరిపడు మాటలు, ఆత్మీయ జీవితమునకు సరిపడు మాటలు. శరీర జీవిత వృద్ధికి సరిపడు మాటలు, ఆత్మీయ జీవిత వృద్ధికి సరిపడు మాటలు విన్నారు. గనుక రెండవ రాకడకు సిద్ధపడండి. శరీర జీవితమును వృద్ధి చేసికొనుచున్న మీరు, ఆత్మీయ జీవితములో వృద్ధిపొందినారా? ఆత్మీయ జీవితములో అనగా వాక్యము, ప్రార్ధన, సేవ వీటిలో వృద్ధి పొందిన యెడల, ఈ లోకములోను పరలోకములోను సౌఖ్యము కలుగును.