సమర్పణ ప్రార్ధన ప్రసంగము
సమర్పణ అనగా "బలి లేక కలిగియున్న యావత్తు ప్రభువు స్వాధీనము చేయుట" అని అర్ధము. నాకు కలిగియున్న యావత్తు నా ఇష్టమును బట్టి వాడుకొనను, నీ ఇష్టమునుబట్టియే వాడుకొందును. ఇవి సుఖముగా నున్నప్పుడు చేయు సమర్పణలు. అయితే కష్టకాలములో కూడ ఇట్టి సమర్పణా స్థితి కలిగి యుండవలెను. ఈ ప్రకారము చేయునప్పుడు నాకు ఆపదలు, ఆటంకములు వచ్చినను నీ చిత్త ప్రకారము చేయుదును.
- 1) ఆపదను బట్టి బాటసారి, మంచి సమరయుడు చేసినదాని నంతటికి సమ్మతించెను. గాయములు కట్టనిచ్చెను, వాహనముమీద ఎక్కించినప్పుడు ఊరుకొనెను, పూటకూళ్ళవాని కప్పగించినప్పుడును ఊరుకొనెను, అంతయు చేయనిచ్చెను. ఆలాగే మనమును ఆయన కప్పగించుకొనిన యెడల, ఆయన ఎంత ఉపకారమైనను చేయగలడు.
- 2) "వారు నీమాట వినరు, అయినప్పటికిని నీవు వెళ్ళి చెప్పవలెను" అని దేవుడు యెహెజ్కేలుతో పలికెను (యెహెజ్మేలు 2:4) యెహెజ్కేలు దేవుని చిత్తమునకు సమర్పణ అయినాడు గనుక ఎదురు చెప్పలేదు. వెళ్ళి వారికి బోధించినాడు. అలాగు దేవుడు మిమ్మును సువార్త అక్కరలేని వారియొద్దకు పంపిన యెడల మీరు వెళ్ళుదురా?
- 3) నీ సహోదరుని మీద నీకు ఏదైన కష్టముంటే ముందు సమాధానపడి, అప్పుడు బలిపీఠమునొద్దకు రమ్ము అని ప్రభువు ఉపన్యాసములో సెలవిచ్చెను (మత్తయి 5:24). ఇది కష్టమైన పని. చందావేయుట సుళువైన పని గాని సమాధానపడుట కష్టమైనపని. దేవుని వాక్యమిచ్చే సలహాకు సమర్పణయైనవారు వాక్యములోనున్నట్టు చేయుదురు. మీరు ఆలాగే చేయగలరా?
- 4) పేతురు యోహానులు గార్థభము విప్పి తీసికొనివచ్చి, ప్రభువు చెప్పినట్లు చేసిరి. ఆలాగే ప్రభువు మాతో "ఫలానిచోటికి వెళ్ళి, ఫలాని పనిచేసి రండి" అని చెప్పిన యెడల సందేహించకుండ చేయువారే, ఆయనకు సమర్పణ అయినవారు. సమర్పణ అయినవారు ప్రభువుయొక్క కోరికను తప్పక నెరవేర్చుదురు.
- 5) ఐదువేలమందికి ఆహారము పెట్టకముందు, ప్రభువు శిష్యులతో - ప్రజలను బారులుగా కూర్చుండబెట్టవలసినదని చెప్పెను. ఆ ప్రకారము వారు చేసిరి. ఇందరకు సరిపోయే రొట్టెలు లేవుకదా! వచ్చిన తరువాత కూర్చుండ బెట్టవచ్చునని వారు ప్రభువునకు ఎదురు చెప్పలేదు. ఆలాగే సమర్పణ అయినవారు ఆటంకమును తలంచక ప్రభువు చెప్పినట్లు చేయుదురు.
- 6) ఒక స్తీ తనకున్నది యావత్తు చందావేసెను. యూదుల నిబంధన ప్రకారము పదియవ భాగము వేయవలెను. నీకున్నదంతయు వేయుము అని ప్రభువు చెప్పక పోయినను ఆమె వేసినది. ప్రభువు చెప్పకపోయినను మనస్సాక్షికి తోచిన మంచి కార్యములు చేయువారే, సమర్పణయైనవారు. చెప్పినదే చేయలేక పోవుచున్నాము, చెప్పనిది మాత్రము చేయగలమా? అని పలుకువారు సమర్పణయైన వారుకారు.
- 7) నీటిమీద నడువవలసినదని ప్రభువు పేతురుతో చెప్పెను. మునిగిపోయినను భయము లేకుండ, ప్రభువు మాటకు సమర్పణయై కొంతదూరమైనను నడువగలిగెను. అసాధ్యమైన పని ప్రభువు చెప్పినప్పుడు పేతురు చేసెను. ఆలాగే అసాధ్యమైన పనులు ప్రభువు చెప్పినప్పుడు చేయువారే సమర్పణ అయినవారు.
- 8) ప్రభువు ఒకనిని చూచి నన్ను వెంబడించుమనెను. అతని దృష్టి తన తండ్రిని సమాధి చేయవలెనని ఉన్నది. మన ఇష్టము ఒక రీతిగా నున్నప్పుడు, ప్రభువు వద్దని చెప్పిన యెడల మానివేయ గలరా? అట్లు ప్రభువు వద్దని చెప్పినను, మానువారే సమర్పణ అయినవారు.
- 9) ప్రభువు డెబ్బదిమందిని ఏర్పరచి సువార్తకు పంపెను. ఇది సువార్తలలో, మనబోధ నిమిత్తము వ్రాయబడెను. ప్రభువు మనలను వేరుగాపిలిచి 'సువార్తకు వెళ్ళండని' చెప్పనక్కరలేదు. ఒక్కమారు చెప్పినా, అందరకు చెప్పివేసినట్టే. దానికి లోబడినవారే సమర్పణయైనవారు.
- 10) యెఫ్తా అను న్యాయాధిపతి జయముపొంది ఇంటికి వచ్చినప్పుడు, తన కుమార్తె ఎదురుగా వచ్చెను. ఆమెను దేవునికి సమర్పించి వేయవలసి వచ్చినను, అతడు వెనుకాడక సమర్పించెను. (న్యాయాధిపతులు 11వ అధ్యాయము) ఆలాగే మా బిడ్డలలో ఎవరినైన ప్రభువునకు సమర్పించుమని చెప్పిన యెడల, ఆలాగు చేయగలరా? అట్టివారే సమర్పణ అయినవారు (యెఫ్తా కుమార్తె కూడ దానికి సమ్మతించెను)
- 11) అబ్రాహాము దైవబలము గలిగినవాడై, తన ఏక పుత్రుని తన చేతులతో బలివేయ నిశ్చయించుకొనెను. ఇది తల్లిదండ్రులైనవారు గ్రహింపలేని గొప్ప సమర్పణ. అట్లు మానవుల గ్రహింపునకు అర్ధముగాని కార్యములు, ప్రభువు కొరకు చేయువారే, సమర్పణా పరులు. (ఇస్సాకుకూడ అందుకు సమ్మతించుట ఆశ్చర్యమే).
- 12) "నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకార్యము" అని యేసు ప్రభువు చెప్పెను. దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు మనకు అన్నము తిన్నట్టుగానే ఉండునా? అట్లుండిన యెడల మీరు సమర్పణాపరులే.