విశ్వాసాభివృద్ధి
- 1. వాగ్దానములు: బైబిలునందు దేవుడు వ్రాయించిన వాగ్దానములు, అనగా రోగులకు తగినవి చదువుకొనవలెను. వాక్యమునందు
- a) పాపులకు తగినవి,
-
b) బీదలకు తగినవి,
-
c) అవిశ్వాసులకు తగినవి,
-
d) భయకంపితులకు తగినవి,
-
e) ఎట్టి అక్కరలోనున్న వారికైనను తగిన వాగ్ధానములు గలవు.
(మత్తయి 5,6,7 అధ్యా॥లు యోహాను 14:14 హెబ్రీ. 12వ అధ్యాయము; కీర్తన 25వ అధ్యాయము; యెహోషువా 1వ అధ్యాయము) మొదలగు వాగ్దానములు చదువుటవలన విశ్వాసము వృద్ధియగును. (ఇది సుళువు మార్గము).
-
2. బైబిలు: బైబిలులో నీ ఇష్టము వచ్చిన అధ్యాయములు, విశ్వాసము పెరుగువరకు చదువుము. జార్జిముల్లరు దొరగారు విశ్వాసములో ప్రసిద్ధి కెక్కినారు. తనకు విశ్వాసము మందగిలినప్పుడు ఆయన ఈ పద్ధతినే అవలంభించిరి.
-
3. స్తుతి: విశ్వాసమున్న యెడల స్తుతి బాగుగా వచ్చును. కొన్ని సమయములలో విశ్వాసము ఉండదు గనుక స్తుతి రాదు. అయినను బలవంతముగా స్తుతి మాటలు పలుకవలెను. అదివరకే స్తుతిమాటలు వచ్చియుండును గదా! స్తుతిమాటలు: స్తోత్రము, స్తుతి, వందనము, నమస్కారములు, నుతులు, కీర్తి మహిమ, మంగళ స్తోత్రార్పణలు, వినుతులు, ప్రణుతి మొదలైనవి. ఇది చాల కష్టమైన వద్ధతి. అయినను చేయవలెను.
-
4. ఆత్మ, స్తుతిని అందుకొనుట: శరీరముతో స్తుతించుట అనగా తెలివిని ఉపయోగించి నాలుక స్తుతిచేయును. అట్టి స్తుతి చేయగా చేయగా, మనలోని ఆత్మ శరీరములోని స్తుతిని అందుకొనును. శరీరము స్తుతి చేసినంత వరకు చప్పగా నుండును. అయితే ఆత్మ అందుకొనగానే గొప్ప సంతోషము కలుగును. ఇక స్తుతి ప్రవాహము ఆగదు.
-
5. ప్రకటన: ఎవరికైన ఒకరికి వాక్యము బోధించుము. అప్పుడు దైవాత్మ నీకు వర్తమానము ఇచ్చును. విశ్వాసమునకు ఉద్రేకము కలుగును. ఒక ఉపాధ్యాయుడు, తన తరగతిలోని మంచి కుర్ర వానిని పెద్దగా ఏర్చరచుట కంటె, అల్లరి కుర్రవానిని ఏర్పరచుట మంచిది. అప్పుడతనికి అల్లరి చేయుటకు సమయముండదు.
-
6. సిలువ: విశ్వాసము మందగిలునప్పుడు, ఏదో ఒక కష్టము కలిగిన యెడల ఆ మందస్థితి పోవును. ఏ దినము మందముగ ఉండునో ఆ రోజున, శ్రమను పంపవలసినదని సాధు సుందరసింగుగారు ప్రార్థించిరి. శ్రమ కలిగినవ్చుడే అసలైన మూలుగు ప్రార్ధన వచ్చును గదా!
-
7. కనిపెట్టుట: ప్రభువు శిష్యులు - "ప్రభువా! మా విశ్వాసము వృద్ధి చేయుము" అని ప్రార్ధించిరి. మనమును అట్లేచేసి, ప్రభువు సన్నిధిలో కనిపెట్టవలెను. అప్పుడు మన స్వంత ప్రయత్నములు ఆగిపోవును. ప్రభువు నీకు వర్తమానమును, విశ్వాసమును, స్తుతిని దయచేయును. బైబిలు చదువుట, స్తుతి చేయుట, ప్రకటన చేయుట, సిలువ అనుభవించుట నీకు ఇష్టముండదు. అప్పుడు కనిపెట్టవలెను.