శోధనను జయించు స్తుతి
- 1. ఓ దేవా! ఈ శోధన నీవు స్వయముగా పంపలేదు గనుక నీకు స్తోత్రములు. ఈ శోధనను నామీదకు పంపుటకు, సాతాను నీ సెలవు కోరుకొన్నది గనుక నీవు సెలవిచ్చినావు.
- 2. సాతానుకు నామీద సెలవు ఇవ్వడములో నన్ను నీవు నమ్మి ఈ శోధనకు సెలవిచ్చిన తండ్రీ! నీకు స్తోత్రములు.
- 3. నేను జయించవలెనను ఉద్దేశముతో, నా బహుమానము కొరకే ఈ శోధనకు సెలవిచ్చినావు తండ్రీ! నీకు స్తోత్రములు.
- 4. శోధన పంపడము వేరు, రానివ్వడము వేరు. 'పంపడము' అనే పని సాతాను చేయుచుండగా, సెలవిచ్చి, శోధన రానివ్వడము దేవుడు జరిగించును. గనుక శోధనకు సెలవిచ్చిన తండ్రీ! శోధనను జయించు శక్తికూడ నాకు ఇస్తావు గనుక నీకు స్తోత్రములు.
- 5. ఈ శోధన మూలముగా నీకు మహిమ, నాకు జయము, సాతానుకు అపజయము కలిగించుటకే ఈ శోధన రానిచ్చినావు గనుక నీకు స్తోత్రములు.
- 6. ఈ శోధన గొలుసు నీ చేతిలో ఉన్నది. గనుక నీకు స్తోత్రములు. గెత్సేమనే తోటలో, శోధనకాలమందు, నా ప్రభువుమీద పడిన శ్రమలకు సెలవిచ్చిన నీవు ఆయనపని ముగించువరకు ఊరుకొన్నావు గాని, నా ప్రభువు పని పూర్తిగా ముగించగానే పరలోక దూతలను పంపి జయము, బలము అనుగ్రహించిన తండ్రీ! నీకు స్తోత్రములు.
- 7. శోధన కాలమందు సైతానును నేను జయించునట్లు; ఈ శోధనను జయించు విషయములో, నా పని నేను పూర్తిగా ముగించునట్టు, నీ ఆత్మ చేత నన్ను వెలిగింపుము.
- 8. గెత్సేమనే తోటలో శోధన కాలమందు, నాప్రభువును, నీ ప్రియకుమారుడునైయున్న ఆయన మనోదృష్టిలో శ్రమలు కనబడుటలేదు. శరీర దృష్టిలో, శ్రమలు కనబడుచున్నవి. మనోదృష్టిలో జయము కనబడుచున్నది. అయితే, శరీర శ్రమలను లెక్కచేయక, నీవనుగ్రహించు జయము తట్టును, మహిమ తట్టును; నా ప్రభువు దృష్టి నిలిపినట్లు, నా మనో దృష్టిని ఈ నమయమందు నీవనుగ్రహించు జయము తట్టు నిలిపి, ఈ శోధనను జయించు శక్తి నాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు.
- 9. ఈ శోధన నీ మహిమ కొరకు రానిచ్చిన తండ్రీ! నీకు స్తోత్రములు. ఈ శోధన నా జయము నిమిత్తము రానిచ్చిన తండ్రీ! నీకు స్తోత్రములు. ఈ శోధన నా బహుమానము కొరకు రానిచ్చిన తండ్రీ! నీకు స్తోత్రములు.
- 10. ఈ శోధన ద్వారా, నాకు సాతానుమీద జయము అనుగ్రహించుటకు రానిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రములు. శోధన రానిచ్చిన ప్రభువా, నాకు జయమిచ్చుటకు నాయొద్ద నిలువబడియున్న తండ్రీ, నీకు స్తోత్రములు. ఆమేన్.