స్వార్పణ
పైనున్న గాలి, ఎండ, వర్షము; క్రింద ఉన్న భూమి, ధనము, పిల్లలు; ఇంట్లో ఉన్నవి; ఒంట్లో ఉన్న ప్రాణము; అన్నియు దేవునికి అర్పించవచ్చును గాని ఆత్మ ఒక్కటే, మనిషి దేవునికి అర్పించలేడు. ఆత్మ అనగా మనిషి తనయొక్క ఇష్టమును దేవునికి అర్పించలేడు, ఆలాగు అర్పించగలిగిన యెడల అది స్వార్పణ.
స్వార్పణ పాఠము:- భూమి, జనము, ధనము, ఎండ, గాలి, వాన, ఇంట్లోని సామాను, శరీరము, ప్రాణము ఇంకా ఏమేమి ఉన్నాయో, అవి అన్నియు దేవునికి అర్పించుటకు నరుడు ఒప్పుకొనవచ్చును. అయితే ఇది స్వార్పణ కాదు. ఆత్మను అనగా హృదయమును, అనగా స్వంత ఇష్టమును అర్పించుట స్వార్పణ అనబడును. శరీరము కాల్చబడుటకు ఇచ్చినను, ప్రేమలేనివాడవైతే ప్రయోజనము లేదని 1కొరింథి 18వ అధ్యాయములో ఉన్న సంగతిని బట్టి చూడగా - అర్పణము, స్వార్పణము కలవు అని బోధపడుచున్నది. అనగా అర్పణ వేరు, స్వార్పణ వేరని తెలియుచున్నది. "వీరు ఎక్కువ ధనము ఇచ్చినవారు", అని ప్రభువు ధనవంతుల కానుకలను మెచ్చుకొనలేదు. ఆయన కేవలము స్వార్పణనే లక్ష్య పెట్టెను. దీనికి సంబంధించి సంఘ చరిత్రలో అనేక కథలు ఉన్నవి.
మొదటి కథ: - ప్రారంభ హతసాక్షులను చూచి, కొందరు హత సాక్ష్యమునకు ఒప్పుకొనిరి. పైన ఉదహరించిన అర్పణములు, వారు ఇష్టముతోనే వేసియుందురు. అయితే స్వార్పణ అనునది వేరొకటి కలదు. అది ఏదై యుండును? అర్పణలో మనుష్యుడు తన లాభమును కోరుట కలదు. అందుచేత వానికి రాణింపులేదు. అర్పణములో లాభము ఏదనగా కీర్తి కోరుట. ఉపకారము (మేలు) కల్గుననే ఒక తప్పు అభిప్రాయము కల్గియుందుటవల్ల కూడ అర్భణములిచ్చుట జరుగును. గనుక ఇదికూడా స్వార్పణ కాదు. ఒకరు తన ఆత్మీయ మేలు నిమిత్తము నిద్రమాని రాత్రింబగళ్ళు, మోకాళ్ళమీద ప్రార్ధనలో గడుపవచ్చును. అయితే ఇదియు స్వార్భణ కాదు. మరియొకరు ఆదికాండము మొదలు ప్రకటన వరకు కంఠత చేసి, వాక్యమును బాగా అర్ధము చేసికొనే వాక్యభాగ్యము కల్గియుందురు. ఇందువల్ల జ్ఞానము కల్గుననే తృప్తి వారి ఉద్దేశమై యున్నది. ఇదియు స్వార్పణలో చేరకపోయి యుండవచ్చును. మరియొకరు సుఖ సంతోషమును చూడక, జీతనాతములు లెక్కచేయక, మనుష్యుల నిందలు నిర్లక్షపెట్టి, శక్తి వంచనలేక సువార్త పని చేయుదురు, గొప్ప బోధకులమని పేరు పొందుదురు. సువార్త నిమిత్తము అంతయు విసర్జింతురు. దీనినికూడా స్వార్పణలో చేర్చకపోవచ్చును.
- 1వ కథ: సర్ ఐజక్ న్యూటన్ మహాగొప్ప పండితుడు. అతడు చెప్పినదేమనగా "లోకమున భక్తులని పేరు పొందిన వారిలో కొందరు ఎందుచేత నరకములో యున్నారు?" (యేసు నామమున అద్భుతములు చేసిన వారిని చూచి ప్రభువు- నేను వారిని ఎరుగనన్నాడు). వారుకూడ ఈ తరగతిలో చేరినవారే! బట్లరు అనే దైవజనుడు క్రీస్తు దైవత్వమును గూర్చి అంగీకరించి, అనేక గ్రంథములు రచించి, చివరకు అవిశ్వాసి యాయెను.
- 2వ కథ: భూలోకములో ప్రసిద్ధి చెందిన దురంతకులు (పాపాత్ములు) మోక్షములో యున్నారేమి? (ఉదా: సిలువ మీద దొంగ, 7 దయ్యములు పట్టిన మగ్ధలేనే మరియ).
- 3వ కథ: ఇది ఏమిటి? దేవుడు నన్ను మోక్షములోనికి తీసికొని వచ్చినాడు! అని కొందరు ఆశ్చర్యపడుదురు. ఈ మూడు ఆశ్చర్యమైన సంగతులు జ్ఞాపకముంచు కొనండి. స్వార్పణ చేయుట ద్వారా మహా ఆశ్చర్యమైన, మహా ఉన్నతమైన స్థితిని పొందుదురు. ఇది సంపాదించుకొనుట సులువే గాని కాపాడుకొనుట కష్టము, గనుక జాగ్రత్త పడుము.
- 1. స్వార్పణను గ్రహించుటకు, అబ్రాహాము ఇస్సాకును అర్పించిన కథ చదవండి. యెప్తా తన కుమార్తెను దేవునికి అర్పించిన కథ చదవండి. స్వార్పణ అనగా బైబిలులో ఏమి యున్నదో అట్లు చేయుట. చదివిన తరువాత, నేర్చుకొన్న తరువాత, తీరా చేయవలసి వచ్చినప్పుడు ప్రశ్నించకూడదు. ఇట్లు చేయుటే స్వార్పణ. "గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నీ చిత్తమును నెరవేర్చుటకు మేము వచ్చియున్నాము" అని చెప్పవలెను.
- 2వది: దేవుడు బయలుపర్చినది నెరవేర్చుట: స్వార్పణ చేస్తేనే గాని దేవుడు సంగతులు బైలుపర్చడు.
- 3. మన స్వంత చిత్తమును వదలుకొని, దేవుని చిత్తమును చేయుట: దేవుని చిత్తము నెరవేర్చుట, ఎంత కష్టమో స్వంత చిత్తమును వదలుకొనుట కూడ అంత కష్టము.
- 4. ఇముడ్చుకొనుట: అనగా సంగతులు తెలిసినప్పుడు, యోగ్యులైనవారు. వాటిని ఇముడ్చుకొందురు, అనగా వెల్లడి చేయరు. (అయితే కూటస్థులకు చెప్పవచ్చును).
- 5. శ్రమలు వచ్చినపుడు సహించలేరు. ఆలాగే మహిమ తెల్సినపుడు ఓర్చుకొనలేరు.
- 6. అంగీకరించుట: మీరు విన్నారు, గ్రహించినారు, ఆనందించినారు, నమ్మినారు. అయితే అంగీకరించినారా? స్వార్పణ చేయువారు అంగీకరింతురు. చిన్న పిల్లలు దేవుని రాజ్యమును అంగీకరింతురని ప్రభువు చెప్పిన మాట వల్ల తెలియుచున్నది. అంగీకరించుట అనగా మహా బాగాయున్నదని ఒప్పుకొనుట. ఇంకొకటి - అంగీకరించుట అనగా పుచ్చుకొనుట, అందుకొనుట, హక్కుగా చేసికొనుట, స్వతంత్రించుకొనుట, దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టక ఆయన చేతిలోనుండి తీసికొనుట. మనము అడిగినది మరల అడుగకుండుట వల్ల అంగీకరించితిమని బుజువు అగుచున్నది.
- 7. చనిపోవుటయే స్వార్పణ: మా స్వభావములో పుట్టే చెడ్డ ఆశలన్నిటిని చంపి వేయవలయును. పిశాచి పుట్టించే తలంపులకు సహితము లోబడకూడదు. "దొంగిలిన వాడు ఇకమీదట అక్కర గలవానికి పంచిపెట్టవలయును" అను వాక్యము జ్ఞాపకము తెచ్చుకొనండి. మన స్వభావము పూర్తిగా మారిపోవలెను. ప్రశ్నలు వేయవచ్చును గాని అవిశ్వాసములో నుండి అవి రాకూడదు. విశ్వాసములో నుండియే రావలెను. నాయందు జీవించుట, నేనుకాదు; క్రీస్తే నాయందు జీవించుట అయియున్నాడు.
- 1. తండ్రివైయున్న తండ్రీ! కుమారుడవై యున్న తండ్రీ! పరిశుద్ధాత్మవై యున్న తండ్రీ! త్రియేకుడవైయున్న తండ్రీ! నేను నిన్ను నా ప్రియమైన తండ్రిగా భావించుచున్నాను. నన్నునూ, నీ ప్రియమైన బిడ్డగా భావించుకొందును, ఆలాగుననే ప్రవర్తించెదను. ఆమెన్.
- 2. నేను అన్న వస్త్రాదులను గాని, ధన ధాన్యాదులను గాని, భూమిని గాని, విద్యను గాని, తుదకు మోక్షమును గాని, కోరుకొనుట లేదుగాని నిన్నే కోరుకొనుచున్నాను. నీవే నాకు సమస్తమై యున్నావు. నేను నీ మీదనే ఆనుకొందును, నిన్నే నమ్ముదును, నిన్నే చూతును. నీవు తప్ప నాకేమియు గొప్ప లేదు. ఆమెన్.
- 3. దేవా! నేను ఏమి చేయకూడదో, ఏమి చేయవలెనో, 'బైబిలు' అనే గ్రంథములో యున్నది. అది చదివి, దాని ప్రకారముగా హాని వచ్చినా, చేస్తాను. పది యాజ్ఞలను బట్టియు, బైబిలులోని ఇతర సంగతులను బట్టియు, నా మనస్సాక్షిని బట్టియు, నీ యాత్మ వెలిగింపును బట్టియు, నన్ను నేను పరీక్షించుకొని నా లోపములు తెలుసుకొని, అన్నియు నీ దగ్గర ఒప్పుకొని దిద్దుబాటు చేసికొందును. ఇట్లు ఊడ్చిన (శుద్దిచేసికొనిన) పిమ్మట ప్రభువును రానివ్వవలెను.
- 1) ఆత్మవలన నడిపించబడి ప్రార్ధన చేయకపోవుటవలన.
- 2) మనలో ఏదో ఒక తప్పిదము ఉన్నందువలన.
- 3) విశ్వాస, నిరీక్షణలు లేకపోవుట వలన.
- 4) మన ఇష్ట ప్రకారము చేసినయెడల, మనకు ముందుకు ఏదో ఒక ముప్పు రానైయున్నదని దేవుని సర్వజ్ఞాన నేత్రమునకు కనబడుటవలన.
- 5) "నెరవేరిన యెడల మనము దానిని సరిగా ఉపయోగించలేము" అని దేవుడు దానిని నెరవేర్చడు.
- 6) ఆయన గడియ ఇంక రాలేదు గనుక నెరవేర్చడు.
- 7) మన ప్రార్ధన ఆయన వినకపోవుటవలన. అనగా తక్కువ మేలు కల్గింపక పోవుటవల్ల; అనగా ఇక్కడే ఆ ప్రార్ధన నెరవేర్చి తక్కువ మేలు కల్గించుట దేవునికి ఇష్టము లేనందున ఆయన మన ప్రార్థన వినడు. గనుక పరలోకములో ఆ ప్రార్ధనకు గొప్ప మేలు కల్గించును.
- 8) ముందుగా పరుగెత్తే విశ్వాసము లేకపోవుటవల్ల దేవుడు మన ప్రార్ధన ఆలకించడు.