తలుపు వేసికొనుము
మనోనిదానము కుదురుటకు ఈ క్రింది అంశములను ధ్యానించి, వాటిని తీవ్రముగా అభ్యసించుము:
తలుపు వేసికొనుము
- 1) ప్రభువు మాత్రమే జ్ఞాపకము రావలెను.
- 2) ఇతర సంగతులు రాకూడదు.
- 3) బోధ వినవలెను.
ప్రార్ధన:- ప్రభువా! ఇవి మూడును కష్టమైన పనులు గనుక మనో నిదానము ఉన్నా మాకు కావలసినది అంతా పొందగలము. దొమ్మర్లకు, సర్కసు వారికి మనో నిదానమున్నది. మాకు అంతకన్న ఎక్కువ కావలెను. గనుక మేము వరిశుద్ధ పౌరుషము తెచ్చుకొని, మనో నిదానము కుదుర్చుకొను కృపదయచేయుము.
- 1వ సంగతి:- నీవు ప్రార్ధన గదిలోనికి వెళ్ళిన తరువాత తలుపు వేసికొనవలెను. నీవు గదిలోనికి వెళ్ళునప్పుడు బయట ఏమి విడిచి వెళ్ళుదువు? పిల్లలు, కోళ్ళు మొ॥నవి, అంతేకాక బయటి మనుష్యులను, పనులను, గందర గోళములను విడిచి వెళ్ళుదువు గదా! ఈ వేళ గదిలోనికి వెళ్ళుటేకాదు, తలువుకూడ వేసికొనవలెను. లేనిచో కోడి పెట్ట వచ్చును (తలంపులోనికి), తోసివేసినా సరే మరి వచ్చును. కుక్క వచ్చును, కుండలు బుటకరించును (బోర్లదోయును). పిల్లలు వత్తురు, పొరుగువారు వచ్చి కేకవేయుదురు. వేటిని రాకూడదని బయట విడిచినామో అవే వచ్చును. గనుక తలుపు వేయవలెను. ఎవరినీ రావద్దని చెప్పాను గదా! కావలి మనిషిని పెట్టానుగదా! అంటే ప్రభువుయొక్క వాక్యమునకు విరుద్ధము. ఎందుకనగా అవి ఉన్నవి గనుక రావలసి ఉన్నవి. కాబట్టి వట్టి ఏకాంత ప్రార్ధనలో మాత్రమే ఈ గొప్పు అనుభవమును సంపాదించుకొనగలవు గనుక నీ పదయ తలువు వేసికొనవలెను.
- 2వ సంగతి:- మొదటి తలుపు కర్రతో చేసిన ఇంటి గుమ్మపు తలుపు. రెండవ తలుపు నీ హృదయ తలుపు. నీవు లోపలకు వెళ్ళిన తరువాత కోడివచ్చునా? రాదు. అయితే నీ ఇంటి తలుపు వేసినా సరే, కోడికూత, కాకికూత, పిల్లల అరుపులు మొదలగునవి అన్ని లోపలికి వచ్చును. తలుపు వేసినను, తప్పకుండా అవి లోపలికి వచ్చును. ఇది నిజమా? అను తలంపుకూడ లోనికి వచ్చును. హృదయములోనికి వచ్చును. గనుక హృదయముయొక్క తలుపువేయుట కూడా అంత అవసరము. హృదయము తలుపు వేసికొనక పోతే కుక్క నక్క అడవి జంతువులు, అనుకొనని వన్నీ లోనికి వచ్చును. తలువు వేసిన యెడిల ఏమి వచ్చినను లెక్కచేయము.
హృదయము అంటే ఏమిటి? వేయుట అనగా నేమి? ఇంటి తలుపు వేయుట సుళువు. హృదయమనగా మనస్సు. తలుపు వేయుట అనగా మన మనస్సులోనికి అవి జ్ఞాపకము రాకుండా చేయుట. అనగా బయటనున్న వేమియు జ్ఞాపకము చేసికొనక పోవుట. ఇది కష్టమే గాని అలవాటైన తరువాత కష్టముకాదు.
ఉదా: ఒక బైరాగికి కూతలు వినబడినవి. వెంటనే చెవులు మూసికొనెను. అప్పుడు పాము కాలిమీద నుండి పోయెను. ఇతను మెదలలేదు గనుక కరవలేదు. అంత మనో నిదానముతో ఆయన ఉండెను. హృదయము తలుపు వేసికొని, ఏ తలంపులు రానీయకుండయుంటే ఎవరు వచ్చును? పరలోకవు తండ్రియే వచ్చును. ఎవరిని వేటిని రానియ్యక పోవుట ప్రభువును రానిచ్చుటకే. అప్పుడు ప్రభువుతో ధారాళముగా మాట్లాడవచ్చును. ఇతర సంగతులు మనసులోనికి వచ్చిన యెడల స్థితి పోవును. ప్రభువు తప్ప ఇతర సంగతులేవియు రాకూడదు. అప్పుడు ప్రభువును అడుగవలసినవి అడుగుము. అప్పుడు ప్రభువుకూడా చెప్పును. కళ్ళు మూసికొని, ఆత్మ కండ్లు తెరచి వ్రభువును చూస్తు అడగండి.