నమ్మకమైన సేవ - 2
III.
ఐగుప్తులో పోతీఫరు తన ఇల్లంతటిని యోసేపునకు అప్పగించెను. పోతీఫరుయొక్క భార్య ఒక్కతే గృహములో గలదు. యోసేపు యౌవనుడు. బంగళాలో ఎవ్వరును లేరు, కూలీలుకూడ లేరు. అప్పటికి ౩ సం॥ల నుండి యోసేపు ఆ ఇంటిలో నుండెను. ఈ ౩ సం॥లు ఆ స్త్రీ యోసేవునకు ఆటంకముగా నుండెను. తండ్రియొద్ద యోసేపు మతము నేర్చుకొన్నాడు గనుక అన్ని కష్ట పరిస్థితులలోను దేవుని యెడల నమ్మకముగా నుండెను. మంచి ప్రవర్తన కలిగియుండెను. గనుకనే ఆమెయొద్దనుండి పారిపోయి, క్రియలో తన నమ్మకము కనపర్చినాడు.
- ఒక కుమారుని (ఇస్సాకును) అబ్రాహామునకు దేవుడిచ్చి, తన యెడల నమ్మకము కనుపర్చుకొనెను. అబ్రాహామును నమ్మకముగా నుండెను.
- ఒక సహోదరుని (యోసేపును) 10 మంది సహోదరులకు దేవుడప్పగించెను. గాని వారు నమ్మకముగా అతనియెడల పని చేయలేదు.
- ఒక స్త్రీని దేవుడు యౌవనస్థుడైన యోసేపున కప్పగించెను.
యోసేపు తన పనిలో నమ్మకముగా నుండెను. అబ్రాహాము ప్రవర్తన మంచిది. కాబట్టి సేవకూడ మంచిది. 10 మంది అన్నల ప్రవర్తన మంచిదికాదు, కాబట్టి సేవకూడ మంచిదికాదు. యోసేపు ప్రవర్తన మంచిది గనుక సేవకూడ మంచిదిగా నుండెను. దేవుడే యోసేపును అన్నల దగ్గరకు, గోతిలోనికి, వర్తకులయొద్దకు, ఐగుప్తుకు, పోతీఫరుయొద్దకు, జైలుయొద్దకు, సింహాసనము నొద్దకు నడిపించెను. దేవుడు మనలను ఒక క్రొత్త గ్రామములో, పరజనుల మధ్య పనిచేయుమని అప్పగించిన యెడల, యోసేపువలె నమ్మకముగా ఉండి పనిచేయవలెను.
ఉదా: వజ్రమును పెంటలోవేసిన లేదా పేడలో వేసిన ఇత్తడిగా మారదు. వజ్రము వజ్రమువలెనే యుండును. ఆలాగే యోసేపు ఇంటిదగ్గర హేళనలో యున్నప్పటికిని, యోసేపుగానే యున్నాడు. గోతిలో నున్నప్పటికిని యోసేపుగానే యున్నాడు. ఐగుప్తు బజారులో నున్నప్పటికిని యోసేపుగానే యున్నాడు. ఖైదులో నున్నప్పటికిని యోసేపుగానే యున్నాడు. ఎన్ని శోధనలలోనున్నను యోసేవుగానే యున్నాడు. వజ్రము మారదు. ఆలాగే యోసేపు మారలేదు. యోసేవువంటి గొప్ప దృష్టాంతము బైబిలులో ఎక్కడను లేదు. యోసేపు ప్రవర్తనలోను, సేవలోను మాదిరి చూపించెను.
IV.
ఒక స్త్రీకి పురుషుని అప్పగించిన కథ: ఆ స్త్రీ ఉన్నది పారశీకదేశము. అది అన్య దేశము. ఆమె యూదురాలు, భక్తిగల స్త్రీ ఆ కాలములో యూదులందరికి గొప్ప అపాయము వచ్చినది. అదేదనగా, యూదులైనవారు ఎక్కడున్నా వారందరిని చంపవలెనని రాజాజ్ఞ బయలుదేరెను. ఆమె రాజుయొక్క బంగళాలోనున్నది. దేవుడామెను అక్కడ ఎందుకు ఉంచెను? ఆమెను దేవుడెందుకు అక్కడకు పంపించెను? ఆమె జనాంగమునకు వచ్చిన గొప్ప ఆపదను తప్పించుటకు. దేవుడామె చేతికి రాజును అప్పగించెను. ఒక దినమున ఆమె రాజుగారి సముఖమునకు వెళ్ళగా, "ఎందుకు వచ్చితివని" రాజు అడిగెను. ఆ స్త్రీయైన రాణి - "మా స్వజనులను చంపివేయుటకు ఎందుకు మీరు ఆజ్ఞ ఇచ్చితిరని" అడిగెను. "అది మంత్రిచేసిన పని"; నేను వ్రాలుచేసిన దానిని మార్చలేను గనుక మరియొక చట్టమును చేయుదునని చెప్పి మరియొక చట్టము వ్రాసి, యూదుల విరోధులనందరిని చంపవలెనని వ్రాయించి, వ్రాలుచేసి రాణికప్పగించెను. ఈరీతిగా యూదులను రక్షించినది ఎస్తేరురాణి. అన్యరాజైన పారశీకరాజు, యూదురాలి పక్షమాయెను. యూదుల పక్షమైనాడు గనుక ఆ రాజు దేవుని పక్షమైనాడు. అబ్రాహాము యొక్క ప్రవర్తన, సేవ బాగున్నది యోసేపు యొక్క ప్రవర్తన, సేవ బాగున్నది; ఆలాగే ఎస్తేరురాణి యొక్క ప్రవర్తన, సేవ బాగున్నది.
V.
ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులు: కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు- ఈ 7 జనాంగములను దేవుడు యూదులకు అప్పగించెను. వారికి యెహోవా మతము నేర్పవలెను. వారికి దేవుని సంగతులు చెప్పవలెను. మరియు మోషే ధర్మశాస్త్రమును వారికి బోధింపవలెను. అయితే మీరు వారితో కలిసియుందరాదు, వారితో వివాహములు చేసికొనరాదని చెప్పెను. మరియు ఆ ప్రదేశమునుండి వారిని తోలివేయవలెననికూడ చెప్పెను. అయితే 10 మంది సోదరులు ఏలాగు నమ్మకముగా పనిచేయలేదో, ఆలాగే యూదులుకూడ నమ్మకముగా పని చేయలేదు. ప్రభువు మనలను నమ్మి, "సర్వ రాష్ట్రములకు సువార్త చెప్పి, శిష్యులనుగా చేయండి" అని ప్రభువు మనకు పని అప్పగించియున్నారు. దేవుడు అబ్రాహాము సంతతికి అన్యజనులను అప్పగించి, "మీ ఇష్టమొచ్చినట్లు చేయండి" అనెను (నెహెమ్యా 9:24). ఆలాగే దేవుడు మనకు గ్రామములను, సంఘములను మొదలగువాటిని అప్పగించినాడు. గనుక మనము నమ్మకముగా పనిచేసి, భళా నమ్మకమైన సేవకుడా! అను మెప్పు పొందవలెను. యూదులు దేవుడప్పగించిన పనిని నమ్మకముగా చేయలేదు గనుక (నెహెమ్యా 9:30) దేవుడు వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. మనమును దేవుని పని నమ్మకముగా చేయనియెడల ఇతరుల చేతిలో పడుదుము. కనుకనే పౌలు మనుష్యులందరి కొరకు, ముఖ్యముగా "రాజులందరి కొరకు ప్రార్థన చేయవలెనని" వ్రాసెను. అప్పుడు సంఘము క్షేమముగా నుండును.
మన ప్రవర్తన బాగున్నదా? దేవునికి ఇష్టమైనదా? మన సేవ బాగున్నదా? దేవుని కిష్టమైనదా? నీ కప్పగింపబడిన పని నమ్మకముగా చేయుచున్నావా?