నమ్మకమైన సేవ - 5



  1. పేతురును యూదులు యెరూషలేములో ఖైదులోనుంచిరి (కార్య. 12:1-10). చేతులకు సంకెళ్ళను, కాళ్ళకు బొండను వేసినారు. ఖైదుకు తాళము వేయబడియున్నది. సంఘములోనివారు ఆయనను విడిపించలేక పోయినారు. గ్రామస్థులందరు నిద్రపోవు చున్నారు. ఖైదులో పేతురుకూడ నిద్రపోవుచుండెను. గాని గ్రామ సంఘము మాత్రము నిద్రపోకుండ ప్రార్ధించుచున్నది. పేతురునకు ప్రకటించు పని ఉన్నది. ఇప్పుడు సంఘమునకు, పేతురు విడుదల కొరకు ప్రార్థించు పని ఉన్నది. వారు క్రొత్తగా సంఘములో చేరిరి, వారికి గుడిలేదు. అయితే వారు తీవ్రముగా ప్రార్ధించిరి. ఈ ప్రార్ధన పరలోకమునకు వెళ్ళవలెను. చెరసాల తలువులు విప్పబడవలెను. సంకెళ్ళు ఊడవలెను. ఈ సంగతి ఆ కాలము వారికి తెలియబడవలెను. అందరకు తెలియవలెను. అట్లు సంఘస్థులు ప్రార్ధించు చుండగా వారి ప్రార్ధన పరలోకమునకు వెళ్ళినది. దేవుడు వారి ప్రార్ధన విన్నాడు. దేవుడు దేవదూతను పంపగా ఆయన పేతురును తీసికొనివచ్చి పట్టణములో విడిచిపెట్టిరి. అప్పుడు "పేతురునకు మెళకువ" వచ్చినది. వారి ప్రార్ధనవలన చెరసాల తలుపులు తెరువబడెను, సంకెళ్ళు ఊడెను, పేతురు విడిపింపబడెను. అప్పుడు పేతురు, వారు ప్రార్ధన చేయుచున్న గది దగ్గరకు వచ్చి తలుపు తట్టినాడు. సంఘము నమ్మకమైన పని చేసినది అనగా ప్రార్ధనపని. అయితే, ఆ సంఘమునకు విశ్వాసము తక్కువ. ఎందుకనగా ప్రార్ధనలోని ఒక అమ్మాయి, తలుపు దగ్గరకు వెళ్ళి పేతురు చేయు చప్పుడు విని, పేతురు వచ్చియున్నాడని చెప్పినప్పుడు వారు నమ్మలేదు. పేతురు వచ్చినాడను సంగతి సంఘస్థులు నమ్మలేదు. ఆయన వస్తాడని సంఘమునకు తెలియదుగాని "పేతురును పంపించుము, విడిపించుము. లేకపోయిన స్తెఫనును చంపినట్టు చంపివేస్తారు ప్రభువా!" అని తీవ్రమైన ప్రార్ధన చేసినారు. వారు మనవులుచేసి, ప్రార్ధన పెట్టుకొన్నారు. ప్రియులారా! ఎవరి విషయమైనను తీవ్రమైన పట్టుదలతో ప్రార్ధించిన యెడల, తప్పక జరుగును. ఎటువంటి ప్రార్ధనయైనను పట్టుదల, తీవ్రమైన ఏకీభావము కలిగిన ప్రార్ధన చేయవలెను.

  2. యూదా ఇస్కరియోతును నమ్మి, ప్రభువు సొమ్ము సంచిని ఇచ్చియున్నాడు. ఉదా: పిల్లి మెడకు రొయ్యలమూట కట్టినట్లున్నదని కొందరు అనుచున్నారు. యోహాను 12:4-6. పన్నెండుమంది శిష్యులలో ఇతడు ఖజానాధికారి. అతడు దొంగిలించువాడని తెలిసికూడ, దేవుడతనికి ఎందుకు డబ్బుసంచి అప్పగించవలెనని అనేకులు అభ్యంతర పడుచున్నారు. దేవుడతనికి పని అప్పగించియున్నాడు. దొంగ మారుటకు క్రీస్తుప్రభువు సన్నిధికన్నా వేరొక స్థలము గలదా! అతడు బాగుపడుటకు ఇంతకన్నా వీలైన స్థలము వేరొకటి గలదా! గనుక ప్రభువు అతనిని తీసికొనివచ్చి తన సన్నిధిని చేర్చుకొన్నాడు. ప్రభువు, అతనికి ౩ 1/2సం॥లు గడువిచ్చినను మారలేదు. ప్రభువు సన్నిధి స్థలములోనైనను యూదా మారలేదు. ప్రభువిచ్చిన గడువు కాలములోనూ మారలేదు. ప్రభువు తన అధికమైన ప్రేమచేత, తన్ను నమ్మి డబ్బు సంచి ఇచ్చినందుకు (పేతురునకు ఇవ్వవలసినది), యూదా ఇంకా ఎక్కువ నమ్మకముగా నుండవలసినది. చివరి రాత్రి ప్రభు భోజనము దగ్గర రొట్టె ఇచ్చి, చివరి గడువు ప్రభువతనికి ఇచ్చియున్నారు. అప్పుడైనను యూదా మారలేదు. ప్రభువు సన్నిధిలో, ఆయన గడువు కాలములో, చివరి కాలములోనైనను యూదా మారలేదు. గనుక "యూదా! నీవు చేయవలసినది త్వరగా చేయుమని" ప్రభువు చెప్పెను. యూదా విషయమై ప్రభువు ప్రార్ధించలేదా? ప్రార్థించెను. అయినను, తనకప్పగించిన పని నమ్మకముగా చేయకుండా తన మీదికి ముప్పు తెచ్చుకొన్నాడు, ఇస్కరియోతు యూదా. చివరకు, దేవుని సన్నిధినుండి వెళ్ళిపోయినాడు. నేడును అనేకమంది బోధకులు, క్రైస్తవులు యూదావలె చేయుచున్నారు.

  3. యెహోవా దేవుడు కయీనుతో, నెమ్మదిగా దయగలిగి మాట్లాడినాడు (ఆది 3:9). నీ తమ్ముడెక్కడ అని అడిగినాడు. నా తమ్మునికి నేను కావలివాడనా? అని కయీను కరుకుగా జవాబిచ్చెను. తాను కానుక ఇచ్చియున్నాడు గాని, తనను కానుకగా ఇచ్చుకొనలేదు.
    • 1) తండ్రి కాలములో యెహోవా దేవుడు కయీనుకు గడువు ఇవ్వగా, అతడు కరుకుగా మాట్లాడి దేవుని సన్నిధిలోనుండి వెళ్ళిపోయినాడు.

    • 2) యేసు ప్రభువు కాలములో యూదా ఇస్కరియోతు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయినాడు.

  4. పరిశుద్ధాత్మ కాలములో అననీయ సప్పీరాలు, పరిశుద్ధాత్మ సన్నిధిలోనుండి వెళ్ళిపోయినారు. అనేకులు సువార్త పనిచేయుచున్నారు గాని తమ ప్పాదయమును దేవునికిచ్చుట లేదు. నా కుమారుడా! నీ హృదయము నాకిమ్మని ప్రభువు అడుగుచున్నారు.

    మూడు కానుకలు: హృదయ కానుక, సరుకు, సొమ్ముకానుక.

    మూడు పనులు: ప్రార్ధనపని, సువార్త పని, కానుకలపని. ఈ మూడు పనులు దేవుడు మనలను నమ్మి, మనకు అప్పగించియున్నాడు. స్ముర్ణసంఘముతో ప్రభువు - ప్రాణాపాయము వచ్చినను, నమ్మకముగా నుండుమని చెప్పెను (ప్రకటన 2:10).

    అపాయములు ఎన్ని రకములు? పోషణ, అన్న వస్త్రాదులకు ఇబ్బంది, వ్యాధి, నింద, శత్రువులు, ప్రాణాపాయము మొదలైనవి. పోషణ విషయములో నమ్మకము కలిగి ఉండుము. వ్యాధుల విషయము ప్రార్థించుము. శత్రువుల విషయము ప్రార్థించుము. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా నుండుము. రాళ్ళు తీసికొని స్తెఫనును కొట్టినప్పుడు, అతడు మోకరించి ప్రార్ధన చేసెను. ప్రాణాపాయము వచ్చినదని తెలిసి ప్రార్ధించెను.

    రెండు అనుభవములు: సిలువ మ్రానుమీది అనుభవము. ప్రాణాపాయములో నమ్మకమైన అనుభవము. గనుకనే జీవ కిరీటము దొరికినది. శ్రమలో సహించే ఉద్యోగము, దేవుడు స్తెఫనుకు ఇచ్చియున్నాడు. స్తెఫనుకు పరలోకము, దేవుని కుమారుడు, జీవకిరీటము, దేవదూతలు కనబడిరి. మనకు ఇబ్బంది, వ్యాధి, నింద, శత్రువులు, ప్రాణాపాయము ఉన్నను పనిపాటలలో నమ్మకముగా నుండవలెను.